ధనుష్‌ను ఆకాశానికెత్తేసిన మృణాల్

తమిళ స్టార్ హీరో ధనుష్, బాలీవుడ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ మధ్య బంధం గురించి గత కొన్ని నెలలుగా ఎంత చర్చ జరిగిందో తెలిసిందే. ఈసారి వేలంటైన్స్ డేకి వీళ్లిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నట్లు కూడా ప్రచారం జరిగింది. కానీ ధనుష్‌తో ఎఫైర్ అంటూ వచ్చిన వార్తలన్నీ అబద్ధమని.. తమ పెళ్లి అని నమ్మిన వాళ్లందరూ వేలంటైన్స్ డేకి ఫూల్స్ డే చూస్తారని ఒక ఇంటర్వ్యూలో కామెంట్ చేసింది మృణాల్.

ఐతే ధనుష్‌తో రిలేషన్‌షిప్ ఏమీ లేదని తేల్చేసింది కానీ.. అతడి మీద ఒక ఇంటర్వ్యూలో ప్రశంసల జల్లు కురిపించింది మృణాల్. తాను ధనుష్‌కు చాలా పెద్ద ఫ్యాన్ అని ఆమె వెల్లడించింది. తన పెర్ఫామెన్స్‌లు చూసి ఫిదా అయిపోయానని ఆమె పేర్కొంది.

‘‘ధనుష్ నటనలో ఒక ఇన్‌స్టిట్యూషన్ లాంటి వ్యక్తి. ఆయన కేవలం గొప్ప నటుడే కాదు.. మంచి సింగర్, సూపర్ డ్యాన్సర్, ఇంకా పాటలు కూడా రాయగలరు. అన్నింటికీ మించి డైరెక్టర్ కూడా. ఆయన చేయనిది ఏముంది? రాయన్, రాన్‌జానా, కెప్టెన్ మిల్లర్ లాంటి సినిమాలు చూసి ఆయనకు నేను పెద్ద ఫ్యాన్ అయిపోయా.

అసురన్ సినిమాను ఎన్నిసార్లు చూశానో లెక్కలేదు. ధనుష్ సార్‌తో కలిసి సినిమాలో నటించేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నా. ధనుష్ సార్ ముంబయిలో ‘తేరే ఇష్క్ మే’ సినిమాలో నటిస్తున్నపుడు.. నేనే నా సినిమా ‘సన్నాఫ్ సర్దార్-2’ ప్రిమియర్‌కు ఆహ్వానించా. ఆయన వస్తారో లేదో అనుకున్నా. రావడంతో చాలా సంతోషించా. ఆయన నాకు మంచి ఫ్రెండ్’’ అని మృణాల్ పేర్కొంది.

ఐతే ధనుష్‌కు తనకు మధ్య ఏమీ లేదని చెబుతున్నా.. ఇప్పటిదాకా కలిసి నటించని ఈ ఇద్దరూ ఇంత క్లోజ్ ఎలా అయ్యారన్నదే చాలామందికి సందేహం. మృణాల్ ఠాకూర్ ఈ ప్రశ్నకు మాత్రం సమాధానం ఇవ్వలేదు.