హీరోగా దేవి… మరి సంగీతం?

తమిళంలో జీవీ ప్రకాష్ కుమార్, విజయ్ ఆంటోనీ లాంటి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్లు ఎప్పుడో హీరోలుగా మారి బోలెడన్ని సినిమాలు చేశారు. ఇప్పటికీ చేస్తున్నారు. తెలుగులో ఆర్పీ పట్నాయక్ కూడా ఇలాంటి ప్రయత్నమే చేశాడు కానీ పెద్దగా సక్సెస్ కాలేదు. తమన్ ముందు నటుడిగా పరిచయమయ్యాడు కానీ.. అది ఒక్క సినిమాకే పరిమితం. తర్వాత సంగీత దర్శకుడిగానే ప్రయాణం సాగిస్తున్నాడు.

ఐతే ఇప్పుడు దేవిశ్రీ ప్రసాద్ లాంటి అగ్రశ్రేణి మ్యూజిక్ డైరెక్టర్ హీరో కాబోతున్నాడు. తన నట అరంగేట్రం గురించి చాలా ఏళ్ల ముందు నుంచే చర్చ జరుగుతోంది. ఐతే ఎట్టకేలకు ‘బలగం’ వేణు దర్శకత్వంలో ‘యల్లమ్మ’ను అతను ఓకే చేశాడు. ఇలాంటి సినిమాతో అతను హీరో అవుతాడని ఎవ్వరూ ఊహించలేదు. ఐతే పూర్తి స్థాయిలో హీరో అవుతున్న దేవి.. మ్యూజిక్ సంగతి ఏం చేస్తాడన్నది ఆసక్తికరం.

ఐతే హీరో కావడం వల్ల సంగీత దర్శకుడిగా తన ప్రయాణం ఏమాత్రం డిస్టర్బ్ కాకుండా చూసుకుంటున్నాడట దేవి. ఈ విషయంలో నిర్మాత దిల్ రాజు పూర్తి సహకారం అందిస్తున్నట్లు దేవి తెలిపాడు. ‘యల్లమ్మ’ కోసం నాన్ స్టాప్‌గా షూటింగ్‌లో పాల్గొనాల్సిన అవసరం లేదని.. నెలలో పది రోజులు షూట్ కోసం కేటాయిస్తే చాలని, మిగతా 20 రోజులు సంగీత దర్శకుడిగా తన పని తాను చేసుకోవచ్చిన సూచించాడట రాజు. ఆ ప్రకారమే చేస్తున్నట్లు దేవి తెలిపాడు.

తాను చాలా ఏళ్ల ముందే హీరో కావాల్సిందని.. సుకుమార్ తనను పరిచయం చేయడానికి కూడా సిద్ధమయ్యాడని.. కానీ తన తండ్రి మరణం, మరి కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్టు ముందుకు కదల్లేదని దేవి చెప్పాడు. సుకుమార్ మాత్రమే కాక త్రివిక్రమ్ శ్రీనివాస్, హరీష్ శంకర్, దిల్ రాజు, కలైపులి థాను లాంటి వాళ్లు తనను హీరో అవ్వమని ఎంతగానో ప్రోత్సహించారని.. అందువల్లే ఇప్పుడు నటనలోకి వచ్చానని దేవి చెప్పాడు.