ఒక సినిమా ఫలితంలో దర్శకత్వం తర్వాత ప్రధానంగా బాధ్యత వహించే విభాగం ఎడిటింగ్. పైకి ఏదో కత్తిరింపులు అతికింపులు అనే తరహాలో సింపుల్ గా అనిపిస్తుంది కానీ నిజానికది చాలా క్లిష్టమైన జాబ్. అందుకే కొందరు మాత్రమే సక్సెస్ ఫుల్ గా రాణించగలుగుతారు. ఇప్పుడీ ప్రస్తావనకు కారణం ఫంకీ.
విశ్వక్ సేన్ హీరోగా అనుదీప్ దర్శకత్వంలో రూపొందిన ఈ ఎంటర్ టైనర్ కు మిశ్రమ స్పందన దక్కిన సంగతి తెలిసిందే. ప్రధానంగా ఎడిటింగ్ మీద కామెంట్స్ ఎక్కువగా వినిపించాయి. సన్నివేశాల మధ్య పొంతన లేకుండా ఫ్లో ఉందని, దీని వల్ల ఇంపాక్ట్ తగ్గిపోయిందనే తరహాలో రివ్యూయర్లు ఈ పాయింట్ ని ఎక్కువ స్ట్రెస్ చేశారు.
దీంతో సహజంగానే అందరి దృష్టి నవీన్ నూలి మీదకు వెళ్తోంది. కొందరు తప్పంతా ఆయనదే అన్న తరహాలో టార్గెట్ చేస్తున్నారు. నిజానికిది ఏకపక్షంగా సమర్ధించే లేదా వ్యతిరేకించే అంశం కాదు. ఎందుకంటే ఫైనల్ అవుట్ ఫుట్ విషయంలో రకరకాల కారణాలు ప్రేరేపితం చేయడం వల్ల ఎడిటర్ బాధ్యత హెచ్చుతగ్గులకు గురవుతుంది.
కొన్నిసార్లు రాజీ పడాల్సి ఉంటుంది. మరికొన్ని సార్లు సబ్జెక్టుని అర్థం చేసుకోకపోవడం వల్ల జరిగే పొరపాట్ల వల్ల కూడా క్వాలిటీ మారుతుంది. ఇటీవలే మన శంకరవరప్రసాద్ గారుకి ఎడిటింగ్ టేబుల్ దగ్గర చేసిన మార్పులు ఎంత ప్లస్ అయ్యాయో అనిల్ రావిపూడి స్వయంగా చెప్పడం చూసాం.
నవీన్ నూలి విషయంలో ఇప్పుడే కాదు గతంలోనూ ట్రిగ్గర్ అయ్యాడు. కింగ్ డమ్ సెకండాఫ్ కు తన అనుభవం ఉపయోగపడలేదనే తరహాలో ఫీడ్ బ్యాక్ వచ్చింది. మాస్ జాతర, జాక్, తెలుసు కదా టైంలోనూ ఇలాంటి మిక్స్డ్ రెస్పాన్స్ చూశాడు.
అయితే ఇదే నవీన్ నూలి పుష్ప 2, ఓజి, లక్కీ భాస్కర్, మ్యాడ్ లాంటి బ్లాక్ బస్టర్లకు పని చేయడాన్ని మర్చిపోకూడదు. డైరెక్టర్ విజన్ కు తగ్గట్టే ఎడిటర్ పని చేస్తాడు తప్పించి పూర్తిగా తన స్వంత నిర్ణయాలకు లోబడి కాదు. కాబట్టి తప్పు ఒకరి మీదకు నెట్టేసి ఒక కోణంలోనే చూడలేం. ఫంకీకి గుడ్ అయినా బ్యాడ్ అయినా దానికి మొదటి బాధ్యత అనుదీప్ అవుతాడు. ఆ తర్వాతే ఇంకేదైనా ఇంకెవరైనా.
Gulte Telugu Telugu Political and Movie News Updates