నరేష్… హీరోయిన్ కు హగ్ ఇవ్వబోయి

గత ఏడాది క్రిస్మస్ కానుగకా రిలీజైన ‘దండోరా’ సినిమాలో ముఖ్య పాత్ర పోషించిన సీనియర్ నటుడు శివాజీ.. ఆ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్లో మహిళల వస్త్రధారణ గురించి చేసిన వ్యాఖ్యలు ఎంతటి దుమారం రేపాయో తెలిసిందే.

ఆ ఈవెంట్లో చీర కట్టుకుని వచ్చిన యాంకర్‌ను ఆభినందిస్తూ.. మహిళలు అలా ఉంటేనే బాగుంటుందని, అర్ధనగ్నంగా బట్టలు వేసుకుంటే ఇబ్బందిగా ఉంటుందని అర్థం వచ్చేలా ఆయన మాట్లాడారు. ఐతే ఆ వ్యాఖ్యలను కొందర సమర్థిస్తే.. కొందరు తీవ్రంగా విమర్శించారు.

గాయని చిన్మయి, యాంకర్ కమ్ యాక్టర్ అనసూయ లాంటి వాళ్లు ఆ వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టారు. కొన్ని వారాల పాటు ఆ టాపిక్ మీద డిస్కషన్ నడిచింది. ఆ తర్వాత వ్యవహారం సద్దుమణిగింది. ఐతే అందరూ మరిచిపోయిన ఆ టాపిక్‌ను సీనియర్ నటుడు నరేష్ మళ్లీ గుర్తు చేశారు.

తాను ముఖ్య పాత్ర పోషించిన ‘హే భగవాన్’ ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
తమ సినిమా ట్రైలర్ లాంచ్ జరిగిన రోజు హగ్ డే అని గుర్తు చేస్తూ.. స్టేజ్ మీద ఉన్న ఒక్కొక్కరినీ హత్తుకోవడం మొదలుపెట్టారు నరేష్. ఐతే మగాళ్లకు హగ్స్ ఇచ్చిన అనంతరం అమ్మాయిల దగ్గరికి వచ్చేసరికి ఆయన తనను తాను నియంత్రించుకున్నారు.

ఈ సినిమా హీరోయిన్ శివాని నగరం, యాంకర్ స్రవంతిలను కూడా తాను హగ్ చేసుకుందామని అనుకున్నానని.. కానీ వాళ్లిద్దరూ చీరలు కట్టుకుని వచ్చారని.. ఈ మధ్య జరిగిన ఒక సంఘటన తర్వాత చాలామంది అమ్మాయిలు సినిమా ఈవెంట్లకు చీరలు కట్టుకునే వస్తున్నారని.. భారతీయ సంప్రదాయం ప్రకారం చీరలు కట్టుకున్న మహిళలను కౌగిలించుకోవడం సరి కాదని.. అందుకే తాను ఆగిపోయానని చెప్పాడు నరేష్.

అనంతరం ఒకరినొకరు మీరే కౌగిలించుకోండి అంటూ శివాని, స్రవంతిలకు నరేష్ చెప్పగా.. వాళ్లిద్దరూ ఆయన మాటలను అనుసరించారు. దండోరా ఈవెంట్ గురించి, శివాజీ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించకపోయినా.. నాటి ఆ వివాదాన్ని దృష్టిలో ఉంచుకునే నరేష్ ఈ వ్యాఖ్యలు చేశారన్నది స్పష్టం.