ఏడుగురు హీరోయిన్లతో క్రిష్ సాహసం ?

గత ఏడాది అనుష్క ఘాటీ రూపంలో దర్శకుడు క్రిష్ చాలా చేదు అనుభవాన్ని ఎదురుకున్నారు. కనీసం యావరేజ్ అయినా ఊరట దక్కేది కానీ డిజాస్టర్ కావడంతో డిఫెండ్ చేసుకునే అవకాశం లేకుండా పోయింది. ఇది చాలదు అన్నట్టు పాక్షికంగా డైరెక్ట్ చేసిన హరిహర వీరమల్లు కూడా ఇదే దారి పట్టడం గాయాన్ని మరింత పెద్దది చేసింది.

ఒకప్పుడు గమ్యం, వేదం, గౌతమీపుత్ర శాతకర్ణి లాంటి క్లాసిక్స్ ఇచ్చిన ఫిలిం మేకర్ ఇలా డౌన్ ఫేజ్ లో ఉండటం మూవీ లవర్స్ ని బాధ పెడుతోంది. అందుకే బలమైన సబ్జెక్టు కోసం క్రిష్ చేస్తున్న కసరత్తు కొలిక్కి వచ్చిందని ఇన్ సైడ్ టాక్. అయితే ఈసారి వ్యవహారం ఆషామాషీగా ఉండటం లేదట.

ఒకరిద్దరు కాదు ఏకంగా ఏడుగురు హీరోయిన్లు ఇందులో నటించబోతున్నట్టు తెలిసింది. వాళ్ళ పేర్లు ఇంకా ఫైనల్ కాలేదు కానీ క్రిష్ ప్రస్తుతం ఆ క్యాస్టింగ్ పనిలోనే ఉన్నారు. ట్రెక్కింగ్ బ్యాక్ డ్రాప్ లో ఒక డిఫరెంట్ ట్రీట్ మెంట్ తో ఉంటుందని వినికిడి.

ఇంతకన్నా వివరాలు ప్రస్తుతానికి లీక్ కాలేదు కానీ క్రిష్ మాత్రం గట్టిగానే హోమ్ వర్క్ చేస్తున్నారట. మారిపోతున్న ఆడియన్స్ అభిరుచులకు అనుగుణంగా అప్డేట్ కావడం నిన్నటి దర్శకులకు పెద్ద సవాల్ గా మారింది. పూరి జగన్నాథ్, శ్రీను వైట్ల లాంటి బ్లాక్ బస్టర్ మేకర్లు సైతం ఈ విషయంలో ఎదురీదుతున్న సంగతి తెలిసిందే.

అయితే క్రిష్ వేరుగా ఉండటానికి కారణం ఆయన రెగ్యులర్ లీగ్ లో సినిమాలు తీయరు. రొటీన్ అనిపించే సబ్జెక్టులు రాసుకోరు. ఆ కారణంనే ఎన్టీఆర్ బయోపిక్ ని ఏరికోరి మరీ క్రిష్ చేతికి ఇచ్చారు బాలకృష్ణ. రిజల్ట్ అనుకున్నట్టు రాలేదు కానీ బ్యాడ్ మూవీ అయితే అనిపించుకోలేదు.

ఇంతకీ ఏడుగురు భామలతో క్రిష్ ఎలాంటి ప్రయోగం చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. తనదైన స్టయిల్ కొనసాగిస్తూనే కొత్త తరహా స్క్రీన్ ప్లే రాసుకున్నారని తెలిసింది. త్వరలో అనౌన్స్ మెంట్ రావొచ్చు. సోలో సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న క్రిష్ కు తాను కోరుకున్న విజయం ఏడుగురు హీరోయిన్లతో అయినా దక్కుతుందేమో చూడాలి.