డిజిటల్ కు దగ్గరైన మరో హీరో

ఇండియాలో వెబ్ సిరీస్‌లు చేయడంలో బాలీవుడ్ స్టార్లు ముందు నుంచి చురకే. ట్రెండును అందిపుచ్చుకుంటూ సైఫ్ అలీఖాన్, షాహిద్ కపూర్, అభిషేక్ బచ్చన్, మనోజ్ బాజ్‌పేయి సహా చాలామంది ప్రముఖ నటులు ముఖ్య పాత్రల్లో వెబ్ సిరీస్‌లు చేశారు. ఇంకా ఆ ఒరవడి కొనసాగుతోంది.

ఐతే దక్షిణాది స్టార్లు మాత్రం డిజిటల్ ఎరేనాను ఇంకా కొంచెం తక్కువగా చూస్తున్నారనే చెప్పాలి. ఇక్కడ విక్టరీ వెంకటేష్, రానా నాయుడు, నాగచైతన్య లాంటి కొందరు స్టార్లు మాత్రమే వెబ్ సిరీస్‌ల్లో నటించారు. వెంకీ-రానా కలిసి ‘రానా నాయుడు’లో నటిస్తే.. చైతూ ‘ధూత’ చేశాడు. ఐతే ఇప్పుడు పరిస్థితి మారుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి.

యువ కథానాయకుడు కిరణ్ అబ్బవరం ఒక వెబ్ సిరీస్ చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మాస్ రాజా రవితేజ సైతం ఈ రూట్లో నడవబోతున్నట్లు ఒక క్రేజీ రూమర్ వినిపిస్తోంది.

ఈలోపే మరో యంగ్ హీరో నిఖిల్ సిద్దార్థ తాను డిజిటల్ వరల్డ్‌లోకి అడుగు పెడుతున్నట్లు ప్రకటించాడు. ఒక ప్రముఖ ఓటీటీ కోసం తాను వెబ్ సిరీస్ చేయనున్నట్లు తన కొత్త చిత్రం ‘స్వయంభు’ టీజర్ లాంచ్ కార్యక్రమంలో నిఖిల్ వెల్లడించాడు. త్వరలోనే పూర్తి వివరాలు ప్రకటిస్తానని చెప్పాడు.

తన కెరీర్లో ‘స్వయంభు’ చాలా స్పెషల్ ఫిలిం అన్న నిఖిల్.. ‘కార్తికేయ-2’తో పాన్ ఇండియా సక్సెస్ అందుకున్నాక, తన మీద ఉన్న అంచనాలను నిలబెట్టుకునేందుకు చాలా గ్యాప్ తీసుకుని, ఎంతో శ్రమించి ఈ సినిమా చేసినట్లు తెలిపాడు.

‘స్వయంభు’ సినిమా చాలా ఆలస్యం అయిందని.. విడుదల కూడా వాయిదా పడింది, అదంతా క్వాలిటీ కోసమే అని నిఖిల్ తెలిపాడు. ‘స్వయంభు’ రెండు భాగాలుగా తెరకెక్కుతున్న విషయాన్ని ఈ సందర్భంగా అతను వెల్లడించాడు. సినిమాలో ఇంకా చాలా విశేషాలు ఉన్నాయని.. దాచిపెట్టామని.. సందర్భానుసారంగా అన్నీ ప్రేక్షకులతో పంచుకుంటామని నిఖిల్ అన్నాడు.