వారణాసి వ్యాపారం గురించి అప్పుడే డిస్కషన్లు

టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ ప్యాన్ ఇండియా మూవీ వారణాసి విడుదలకు ఇంకా ఏడాదికి పైగానే సమయం ఉన్నప్పటికీ అప్పుడే ట్రేడ్ వర్గాల్లో, ప్రేక్షకుల్లో దీని గురించిన చర్చలు చాలానే జరుగుతున్నాయి. ముఖ్యంగా మార్కెట్ ని ఆకట్టుకునే ఉద్దేశంతో రాజమౌళి చేసిన ఈవెంట్, టైటిల్ రివీల్ వీడియో, అంతర్జాతీయ మీడియాకు మహేష్ బాబు అండ్ టీమ్ ఇచ్చిన ఇంటర్వ్యూలు వగైరాలన్నీ ముందస్తు ప్రణాళికలో భాగంగా జరిగినవే.

అందుకే ఏరియాల వారిగా బిజినెస్ కోసం అప్పుడే డిస్ట్రిబ్యూటర్లు నిర్మాత కెఎల్ నారాయణతో సంప్రదింపులు మొదలుపెట్టారని ఇన్ సైడ్ టాక్. కాకపోతే ఇంకా ఫైనల్ కాలేదు.

ఒక్క నైజామ్ నుంచే నూటా యాభై నుంచి రెండు వందల కోట్ల దాకా ఆఫర్ ఉన్నట్టు లీక్ వినిపిస్తోంది. అయితే ఇది చాలా పెద్ద మొత్తం. ఇంత రికవరీ కావాలంటే ప్రీమియర్ షోల టికెట్ రేట్లు వెయ్యి కాదు రెండు వేల రూపాయలు పెట్టాల్సి వస్తుంది. దానికి ప్రభుత్వం అనుమతిస్తుందా అంటే అప్పటి పరిస్థితులను ఇప్పుడే ఊహించలేం కాబట్టి వేచి చూడాలి.

ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో రూపొందుతున్న వారణాసిని నెవెర్ బిఫోర్ ఆన్ ఇండియన్ స్క్రీన్ తరహాలో రాజమౌళి బృందం మార్కెటింగ్ చేయబోతున్నారు. అది సరిగ్గా చేయగలిగితే దీనికి ఎంతైనా ఇవ్వొచ్చు అనే అభిప్రాయం ఆడియన్స్ లో కలుగుతుంది.

నైజామ్ ఒకటే కాదు సీడెడ్ నుంచి ఓవర్సీస్ దాకా పంపిణి హక్కుల ధరలు ఇదే తరహాలో ఉండబోతున్నాయని ఇండస్ట్రీ వర్గాలు ముందస్తు అంచనా వేస్తున్నాయి. ఆర్ఆర్ఆర్ కన్నా ప్రతి ఏరియా మీద ఇరవై నుంచి ముప్పై కోట్లు అదనంగా పలకొచ్చని వినికిడి. అలా అయితేనే వారాణసి మీద పెట్టుబడి వర్కౌట్ అవుతుంది.

ఆగస్ట్ లో మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా టీజర్ వదిలి తద్వారా సినిమా కంటెంట్ ఏ స్థాయిలో ఉంటుందనే మెసేజ్ ప్రపంచానికి ఇచ్చేలా రాజమౌళి సన్నాహాలు చేస్తున్నారట. ఎప్పటిలాగా కాకుండా ఈసారి 2027 ఏప్రిల్ 7 విడుదల తేదీని ఎట్టి పరిస్థితుల్లో మిస్సయ్యే ఛాన్స్ లేదంటున్నారు.