విశ్వంభర ట్రెండ్ ఫాలో అవ్వదు

ఇప్పుడు స్టార్ హీరోల సినిమాల్లో టైటిల్ కార్డ్స్ అన్నవి తప్పనిసరి అయిపోయాయి. జస్ట్ పేరు, దాని ముందు ఒక ట్యాగ్ వేసి ఊరుకోవట్లేదు. గతంలో మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ రజినీకాంత్ లాంటి కొందరు టాప్ స్టార్లకు మాత్రమే టైటిల్ కార్డ్ వేసేటపుడు హంగామా ఉండేది. కానీ ఇప్పుడు ప్రతి హీరోకూ స్పెషల్ టైటిల్ కార్డ్ వేయిస్తున్నారు.

వాళ్ల కెరీర్లో కల్ట్ క్యారెక్టర్ల తాలూకు బొమ్మలు తీసుకుని యానిమేషన్లో టైటిల్ కార్డ్స్ రెడీ చేయిస్తున్నారు. ఇది ప్రధానంగా తమిళ స్టార్ హీరో విజయ్ మూవీ ‘లియో’ నుంచి మొదలైన ట్రెండ్. అందులో విజయ్‌ కోసం రెడీ చేయించిన టైటిల్ కార్డ్ తన అభిమానులనే కాక అందరినీ ఆకట్టుకుంది.

దీంతో అందరూ అదే బాట పడుతున్నారు. తెలుగులో కూడా చాలామంది స్టార్ల సినిమాలకు ఈ స్టైల్‌ను ఫాలో అయ్యారు. చిన్న స్టార్లు సైతం ఇదే శైలిని అనుసరించడం.. దీనికి విలువ లేకుండా పోయింది.

ఐతే మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా ‘విశ్వంభర’కు మాత్రం టైటిల్ కార్డ్ విషయంలో రెగ్యులర్ ఫార్మాట్లు ఉండవట. దాని కోసం ప్రత్యేకంగా డిజైన్లు చేయించినట్లు దర్శకుడు వశిష్ఠ ఒక ఇంటర్వ్యలో చెప్పాడు.

‘‘లియో తర్వాత యానిమేటెడ్ టైటిల్ కార్డ్స్ ట్రెండుగా మారాయి. కానీ విశ్వంభర కోసం ఆ స్టీరియో టైప్‌ను ఫాలో అవ్వాలని మేం అనుకోలేదు. అందుకే సినిమా కథ, ఆత్మకు తగ్గట్లుగా ఎనిమిది ప్రత్యేకమైన మెగాస్టార్ టైటిల్ కార్డ్స్‌ డిజైన్స్ తయారు చేయించాము. ప్రతి ఒక్కటీ విశ్వంభర కాన్సెప్ట్‌ను ప్రతిబింబించేలా ప్రత్యేకంగా ఉంటుంది’’ అని వశిష్ఠ వెల్లడించాడు.

గత ఏడాది సంక్రాంతికే రావాల్సిన ఈ చిత్రం విజువల్ ఎఫెక్ట్స్ కరెక్షన్ల వల్ల బాగా ఆలస్యం అయింది. ప్రస్తుతం వినిపిస్తున్న రిలీజ్ డేట్ జులై 10. త్వరలోనే ప్రకటన రావచ్చని అంచనా వేస్తున్నారు. యువి క్రియేషన్స్ రూ.250 కోట్ల బడ్జెట్లో ఈ సినిమాను నిర్మించింది.