డ్రాగన్ భామ వాళ్ల టార్గెట్ అవబోతుందా..?

కన్నడ నుంచి వచ్చే కథానాయికలకు తెలుగు పరిశ్రమలో మంచి డిమాండ్ ఉంటుంది. అటు అభినయంతో మెప్పిస్తూనే ఇటు గ్లామర్ పరంగా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో వాళ్లు పైచేయి సాధిస్తారు. ప్రస్తుతం తెలుగులో టాప్ లీగ్ లో కొనసాగుతున్న రష్మిక మందన్న కెరీర్ ప్రారంభించింది కన్నడలోనే అయిన టాలీవుడ్ అవకాశాల వల్లే ఎక్కువ పాపులారిటీ తెచ్చుకుంది. అంతేకాదు నేషనల్ క్రష్ గా మారి జాతీయ స్థాయిలో అవకాశాలు తెచ్చుకోవడంలో తెలుగు పరిశ్రమ ఎంతో సపోర్ట్ చేసింది. అందుకే తన సొంత పరిశ్రమని వదిలి తెలుగు సినిమాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ వచ్చింది రష్మిక.

ఆమె తెలుగు సినిమాలే చేయడం నచ్చని కన్నడిగులు రష్మికని టార్గెట్ చేశారు. ఆమె పూర్తిగా తెలుగు సినిమాలే చేయడం కన్నడలో చేయాల్సిన సినిమాలను డేట్స్ అడ్జెస్ట్ మెంట్ చేయలేక వదిలేయడం లాంటివి ఆమెను వాళ్లకు దూరమయ్యేలా చేశాయి. అంతేకాదు రిషబ్, రక్షిత్ శెట్టిల సినిమాల పట్ల ఆమె స్పందించక పోవడంపై కూడా కన్నడ ప్రేక్షకులు రష్మిక మీద గుర్రుగా ఉన్నారు. ఈ ప్రతికూల అంశాలను కూడా రష్మిక సానుకూలత గా భావించి కెరీర్ కొనసాగిస్తుంది.

రష్మిక వంతు పూర్తి కాగా ఇప్పుడు అదే పరిస్థితి రుక్మిణి వసంత్ కి వచ్చేలా ఉంది.. సప్త సాగరాలు దాటి సినిమాతో సౌత్ లో పాపులారిటీ తెచ్చుకున్న రుక్మిణి తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ ఏర్పరచుకుంది. తెలుగు ఎంట్రీ గ్రాండ్ గా ఉంటుందని ఊహించగా నిఖిల్ తో అప్పుడో ఇప్పుడో ఎప్పుడో అంటూ ఒక డిజాస్టర్ సినిమా చేసింది. ప్రస్తుతం ఎన్టీఆర్ నీల్ కలయికలో వస్తున్న సినిమాలో రుక్మిణి కథానాయికగా చేస్తుంది.

రిషబ్ శెట్టి కాంతారా చాప్టర్ 1లో కనకవతి పాత్రలో అదరగొట్టేసింది రుక్మిణి. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకున్న అమ్మడు కన్నడలో కూడా స్టార్ క్రేజ్ తెచ్చుకుంది. ఆల్రెడీ ఎన్టీఆర్ మూవీ ఛాన్స్ రాగానే తెలుగులో ఆమె డిమాండ్ పెరిగింది. ఈ టైం లోనే రుక్మిణి కూడా రష్మిక లానే తెలుగు సినిమాలనే సైన్ చేస్తుందా అన్న అనుమానం రాక తప్పదు.

ప్రస్తుతం తెలుగు చలన చిత్ర పరిశ్రమ సినిమాలు జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంటున్నాయి  టాలీవుడ్ లో స్టార్ స్టేటస్ ని అందుకుంటే ఆ హీరోయిన్స్ ని హిందీ మేకర్స్ ఎంపిక చేయడం అవుతుంది. అందుకే సౌత్ హీరోయిన్స్ అందరి గురి తెలుగు పరిశ్రమ మీద ఉంది.

రుక్మిణి వసంత్ గురి కూడా టాలీవుడ్ అవుతుందా లేదా తన మాతృభాషాభిమానం చూపిస్తుందా అన్నది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం తెలుగులో తారక్ సినిమా ఒక్కటే చేస్తున్న రుక్మిణి తర్వాత చరణ్ తో జతకట్టేందుకు రెడీ అవుతుందని అంటున్నారు.

కన్నడ వదిలి తెలుగు, తమిళ భాషల్లో రుక్మిణి సినిమాలు చేస్తే మాత్రం రష్మికని ఎలాగైతే కన్నడ ప్రేక్షకులు టార్గెట్ చేశారో అలానే ఈమెను కూడా విమర్శించే అవకాశం ఉంటుంది. మరి ఈ విషయంలో రుక్మిణి నిర్ణయం ఎలా ఉంటుందో వేచి చూడాలి.