కోరుకున్న‌దాని కంటే మూడింత‌ల పారితోష‌కం ఇచ్చిన యూవీ

ఒక న‌టుడు సినిమా నుంచి ఒక పారితోష‌కం ఆశిస్తాడు. టీం అనుకున్న దాని కంటే మూడు రెట్ల‌కు పైగా రెమ్యూన‌రేష‌ణ్ ఇస్తే ఆ న‌టుడి ప‌రిస్థితి ఏంటి? త‌న తొలి సినిమాకు ఇలాంటి అనుభ‌వ‌మే ఎదుర్కొన్నాన‌ని అంటున్నాడు క‌మెడియ‌న్‌గా మంచి పేరు సంపాదించిన సుద‌ర్శ‌న్.

ఒక‌ప్పుడు చిన్న చిన్న పాత్ర‌లు చేసిన సుద‌ర్శ‌న్.. ఇటీవ‌ల క‌మెడియ‌న్‌గా మంచి స్థాయినే అందుకున్నాడు. టిపిక‌ల్ కామెడీ టైమింగ్‌, నెల్లూరు యాస‌తో డైలాగులు చెప్పే సుద‌ర్శ‌న్.. ఇటీవ‌ల‌ సంక్రాంతి సినిమా నారీ నారీ న‌డుమ మురారిలోనూ భ‌లేగా న‌వ్వించాడు.

తెలుగులో త‌న తొలి చిత్రం.. శ‌ర్వానంద్ హీరోగా సుజీత్ రూపొందించిన ర‌న్ రాజా ర‌న్. అందులో త‌న‌ది చాలా చిన్న పాత్రే. ఆ సినిమాకు తాను తీసుకున్న పారితోష‌కం గురించి ఒక ఇంట‌ర్వ్యూలో మాట్లాడాడు సుద‌ర్శ‌న్.

రన్ రాజా ర‌న్ త‌న‌కు తొలి సినిమా కాబ‌ట్టి.. సెంటిమెంటుగా ఎంతో కొంత పారితోష‌కం తీసుకోవాల‌నుకున్నాన‌ని.. ఫ‌స్ట్ మూవీ ఫ్రీగా చేస్తే త‌ర్వాత డ‌బ్బులు రావేమో అనుకున్నాన‌ని చెప్పాడు సుద‌ర్శ‌న్. వెయ్యో రెండు వేలో ఇస్తే బాగుండ‌ని అనుకున్న‌ట్లు అత‌ను వెల్ల‌డించాడు.

ఐతే డ‌బ్బుల కోసం వెళ్లి టీంలో వాళ్ల‌తో మాట్లాడితే.. సినిమాకు బ‌డ్జెట్ అనుకున్న దాని కంటే ఎక్కువ అయింద‌ని, రెమ్యూన‌రేష‌న్ అదీ త‌ర్వాతి సినిమాకు చూద్దామ‌ని ప్రొడ‌క్ష‌న్ వాళ్లు అన్న‌ట్లు సుద‌ర్శ‌న్ వెల్ల‌డించాడు. ఐతే సినిమా అంతా అయ్యాక త‌న‌కు ఒక క‌వ‌ర్ ఇచ్చార‌ని.. అందులో వెయ్యి రూపాయ‌లు ఉంటాయ‌ని అనుకున్నాన‌ని.. తీసి చూస్తే రూ.3500 ఉన్నాయ‌ని.. తాను ఆశించిన దాని కంటే ఎక్కువ డ‌బ్బులు ఉండ‌డంతో చాలా సంతోషించాన‌ని సుద‌ర్శ‌న్ వెల్ల‌డించాడు.

ఆ డ‌బ్బులు గుడిలో హుండీలో వేద్దామా.. ఇంకేమైనా మంచి ప‌ని చేద్దామా అని ఆలోచించి.. చివ‌రికి ఫ్రెండ్స్‌తో క‌లిసి ఖ‌ర్చు పెట్టేసిన‌ట్లు సుద‌ర్శ‌న్ తెలిపాడు. త‌ర్వాత ఓ సంద‌ర్భంలో యువి ప్రొడ‌క్ష‌న్స్ అధినేత వంశీకి ఈ విష‌యం చెబితే.. అనుకున్న దాని కంటే ఎక్కువ డ‌బ్బులు ఇచ్చామంటే, ప్రొడ‌క్ష‌న్ కంట్రోల్ చేయాల‌న్న మాట అని జోక్ చేసిన‌ట్లు సుద‌ర్శ‌న్ తెలిపాడు.

మ‌రోవైపు ఈటీవీలో వచ్చే క్యాష్ ప్రోగ్రాంలో పార్టిసిపెంట్లు గెలిచే డ‌బ్బంతా రియ‌ల్ అని బ‌య‌ట జ‌నం అనుకుంటార‌ని.. తాను కూడా అక్క‌డ మూణ్నాలుగు కోట్ల దాకా గెలిచాన‌ని.. అదంతా నిజం అనుకుని బ‌య‌టి వాళ్లు డ‌బ్బుల గురించి అడుగుతుంటార‌ని.. అది నిజం కాద‌ని చాలామందికి తెలియ‌ద‌ని సుద‌ర్శ‌న్ చెప్పాడు.