చైతూ ల్యాండ్ మార్క్ మూవీ.. చిన్న ద‌ర్శ‌కుడితోనా?

వ‌రుస ఫ్లాపుల త‌ర్వాత గ‌త ఏడాది ఇదే స‌మ‌యానికి తండేల్ సినిమాతో ఓ మంచి విజ‌యాన్ని ఖాతాలో వేసుకున్నాడు అక్కినేని యువ క‌థానాయ‌కుడు నాగ‌చైత‌న్య‌. మొత్తంగా అక్కినేని ఫ్యామిలీకే అది చాన్నాళ్ల త‌ర్వాత ద‌క్కిన విజ‌యం కావ‌డంతో అభిమానులు ఎంతో సంతోషించారు.

దీని త‌ర్వాత విరూపాక్ష ద‌ర్శ‌కుడు కార్తీక్ దండుతో వృష‌క‌ర్మ అనే పెద్ద సినిమా చేస్తున్నాడు చైతూ. భారీ సెట్స్, విజువ‌ల్ ఎఫెక్ట్స్‌తో ముడిప‌డ్డ సినిమా కావ‌డంతో పూర్తి కావ‌డానికి టైం ప‌డుతోంది. వేస‌విలో రిలీజ్ ఉండొచ్చు. ఈ సినిమా పూర్త‌య్యేలోపే త‌న కొత్త సినిమాను చైతూ ఖాయం చేసిన‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి.

ఇంత‌కుముందు త‌న‌తో మ‌జిలీ తీసిన శివ నిర్వాణ‌తో చైతూ చ‌ర్చ‌లు జ‌రిపాడు కానీ.. అవి ఒక కొలిక్కి రాలేదు. శివ‌.. ర‌వితేజతో ఇరుముడి సినిమా మీదికి వెళ్లిపోయాడు. ఐతే ఇప్పుడు చైతూ ఓ చిన్న సినిమా ద‌ర్శ‌కుడితో జ‌ట్టు క‌ట్ట‌బోతున్న‌ట్లు స‌మాచారం.

కొన్నేళ్ల ముందు కార్తికేయ హీరోగా బెదురులంక 2012సినిమా తీసి హిట్టు కొట్టిన క్లాక్స్‌తో చైతూ సినిమా చేయ‌బోతున్నాడ‌ట‌. సుదీర్ఘ కాలం మేకింగ్‌లో ఉండి.. పెద్ద‌గా అంచ‌నాలు లేకుండా విడుద‌లైన బెదురులంక ప్రేక్ష‌కుల‌కు వినోదాన్ని పంచి, మంచి ఫ‌లిత‌మే అందుకుంది. ఆ త‌ర్వాత క్లాక్స్ కొత్త సినిమా ఏదీ అనౌన్స్ కాలేదు.

కొన్ని రోజులుగా చైతూతో అత‌ను స్టోరీ డిస్క‌ష‌న్స్ చేస్తున్నాడు. ఎట్ట‌కేల‌కు అక్కినేని కాంపౌండ్ నుంచి గ్రీన్ సిగ్న‌ల్ వ‌చ్చింది. ఈ చిత్రాన్ని అన్న‌పూర్ణ బేన‌రే.. బ‌న్నీ వాసుతో క‌లిసి నిర్మించ‌నుంద‌ని స‌మాచారం. తండేల్ మూవీని ప్రొడ్యూస్ చేసింది గీతా సంస్థే అయినా అన్నీ చూసుకుంది వాసునే.

ఇప్పుడ‌త‌ను సొంతంగా బేన‌ర్ పెట్టి సినిమాలు తీస్తున్నాడు. ఆ బేన‌రే.. అన్న‌పూర్ణ‌తో క‌ల‌వ‌నుంద‌ట‌. ఇది ఒక ల‌వ్ స్టోరీ అని స‌మాచారం. చైతూ కెరీర్లో ప్రేమ‌క‌థ‌ల‌ది ప్ర‌త్యేక స్థానం. ఏమాయ చేసావే మొద‌లుకుని తండేల్ వ‌ర‌కు ప్రేమ‌క‌థ‌ల‌తోనే అత‌ను విజ‌యాలందుకున్నాడు. త్వ‌ర‌లోనే చైతూ, క్లాక్స్ మూవీ గురించి అనౌన్స్ రానుంది. ఇది చైతూ కెరీర్లో 25వ సినిమా కావ‌డం విశేషం.