ప్రభాస్ లేకుండా కల్కి-2 షూట్?

‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ చేసిన, చేస్తున్న, చేయబోయే ప్రతి సినిమా భారీ స్థాయిదే. కాస్టింగ్, బడ్జెట్ అన్నీ కూడా వేరే లెవెల్. అయినా సరే.. చాలా స్పీడుగానే సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు. తన కోసం ఎప్పుడూ రెండు మూడు సినిమాల మేకర్స్ ఎప్పుడు డేట్లు ఇస్తాడా అని ఎదురు చూస్తుంటారు.

ఇటీవలే సంక్రాంతికి ‘ది రాజాసాబ్’ చిత్రంతో పలకరించిన ప్రభాస్.. ప్రస్తుతం సమాంతరంగా ‘ఫౌజీ’, ‘స్పిరిట్’ చిత్రాల షూటింగ్‌లో పాల్గొంటున్నాడు. రెండు చిత్రాలకు వీలు చూసుకుని డేట్లు సర్దుబాటు చేస్తున్నాడు. 

‘ఫౌజీ’ దసరాకు రిలీజ్ కావాల్సి ఉండడంతో ఎక్కువ ప్రయారిటీ దానికే ఇస్తున్నాడు. దీంతో పాటే అప్పుడప్పుడూ కొన్ని రోజులు ‘స్పిరిట్’ షూట్‌లో పాల్గొంటాడు. ఐతే ప్రభాస్ కోసం ‘కల్కి-2’ టీం కొన్ని నెలల ముందు నుంచే ఎదురు చూస్తోంది. ఈ సీక్వెల్‌కు స్క్రిప్టుతో పాటు ప్రి ప్రొడక్షన్ పనులూ పూర్తయిపోయాయి. షూట్ మొదలుపెట్టడానికి డేట్లు సర్దుబాటు ఒక్కటే అడ్డంకి అని ఇటీవల సంగీత దర్శకుడు సంతోష్ నారాయణన్ కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు.

ఐతే ప్రభాస్ కోసం మరీ ఎక్కువ కాలం ఎదురు చూస్తే కష్టమని.. త్వరలోనే షూట్‌కు వెళ్లిపోతున్నాడట దర్శకుడు నాగ్ అశ్విన్. ‘కల్కి’లోనే కాక ‘కల్కి-2’లోనూ కీలక పాత్రల్లో కొనసాగనున్న అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ ఈ సినిమా కోసం డేట్లు సర్దుబాటు చేశారట. మిగతా ఆర్టిస్టుల డేట్లు కూడా సర్దుబాటు చేసుకుని.. ముందుగా ప్రభాస్‌తో సంబంధం లేని సన్నివేశాల చిత్రీకరణ చేయబోతున్నాడట నాగ్ అశ్విన్.

అవి అయ్యాక ఎడిటింగ్, విజువల్ ఎఫెక్ట్స్ పనులు జరుగుతాయి. ప్రభాస్ ఎప్పుడు వస్తే అప్పుడు తన మీద ప్రత్యేకంగా తీయాల్సిన సన్నివేశాలు, వేరే ఆర్టిస్టులతో కాంబినేషన్ సీన్లు చేసుకుంటారు. ఇలా షూటింగ్ అయితే చాలా కాలమే సాగేలా కనిపిస్తోంది. ఈ సినిమా వచ్చే ఏడాది చివర్లో లేదా 2028 ఆరంభంలో రిలీజయ్యే అవకాశాలున్నాయి.