ప్రభాస్.. ఇది గమనిస్తున్నాడా?

అనుకున్నదే జరుగుతోంది. థియేటర్లలో రిలీజైనప్పటి కంటే ఓటీటీలోకి వచ్చాక ‘ది రాజాసాబ్’ మీద ట్రోలింగ్ ఇంకా ఎక్కువ జరుగుతోంది. సినిమా థియేటర్లలో ఉండగా రెండు మూడు వారాల పాటు దర్శకుడు మారుతిని టార్గెట్ చేసుకుని, కొంచెం గ్యాప్ తీసుకున్న ప్రభాస్ ఫ్యాన్స్.. ఇప్పుడు మళ్లీ డ్యూటీ ఎక్కారు. వాళ్లు మాత్రమే కాక సినిమా చూస్తున్న మిగతా సినీ ప్రేక్షకులు సైతం ‘రాజాసాబ్’ మీద విమర్శలు గుప్పిస్తూ పోస్టులు పెడుతున్నారు. 

ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కువగా పోస్టులు ప్రభాస్ లుక్ విషయంలోనే కావడం గమనార్హం. సినిమాలో చాలా చోట్ల ప్రభాస్ కోసం బాడీ డబుల్ వాడిన విషయాన్ని థియేట్రికల్ రిలీజ్ టైంలోనే చాలామంది పసిగట్టారు. రిలీజ్ ముంగిట ఇంటర్వ్యూల్లో బాడీ డబుల్ వినియోగం గురించి మారుతి చేసిన కామెంట్ల వల్ల కూడా ప్రభాస్‌కు డ్యామేజ్ జరిగింది.

ఐతే ఇప్పుడు టీవీలో, మొబైళ్లలో రిపీట్స్‌లో, స్లో మోషన్లో సన్నివేశాలు, ఫైట్లు, పాటలను చూసి పెడుతున్న పోస్టులు ప్రభాస్ మద్దతుదారులకు ఇబ్బందికరంగా మారాయి. ఫైట్లలో బాడీ డబుల్స్ వాడడం మామూలే కానీ.. మరీ పాటలు, సన్నివేశాల్లో కూడా ఈ పని చేయడం, గ్రాఫిక్స్‌ను ఆశ్రయించడం మీద విమర్శలు తప్పట్లేదు.

మారుతి సంగతేమో కానీ.. ఇది ప్రభాస్‌కే చాలా డ్యామేజింగ్ అన్నది స్పష్టం. మారుతి ఎంత చిన్న దర్శకుడైనప్పటికీ.. సినిమాను ఇంత తేలిగ్గా తీసుకోవాలా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. 

ఇలా బాడీ డబుల్స్, గ్రాఫిక్స్‌ను ఆశ్రయించడం వల్లే అతను వేగంగా సినిమాలు చేయగలుగుతున్నాడని.. ఇది తన మీద ఉన్న అభిమానాన్ని క్యాష్ చేసుకోవడమే అని..  ఏమాత్రం ఎఫర్ట్ పెట్టకుండా ఇలా ప్రేక్షకులను మోసం చేయడం తప్పు అనే అభిప్రాయాలు బలంగా వినిపిస్తున్నాయి.

ఇకపై ప్రభాస్ ఇదే తీరును కొనసాగిస్తే మాత్రం తనపై ప్రేక్షకులు నమ్మకం కోల్పోయి.. నెగెటివ్ అభిప్రాయం ఏర్పడే ప్రమాదం ఉంది. కాబట్టి అతనీ విషయంలో జాగ్రత్త పడాల్సిన అవసరం కనిపిస్తోంది. హను రాఘవపూడి, సందీప్ రెడ్డి వంగ అంత సులువుగా రాజీ పడే దర్శకులు కాదు కాబట్టి.. ఫౌజీ, స్పిరిట్ చిత్రాల్లో ప్రభాస్‌తో పూర్తి స్థాయిలో నటింపజేసి మళ్లీ ప్రేక్షకుల నమ్మకం చూరగొనేలా చేస్తారని ఆశిద్దాం.