డబుల్ అల్లరి చేయబోతున్న రావిపూడి హీరోలు

ఇంకా అధికారిక ప్రకటన రాలేదు కానీ అనిల్ రావిపూడి పదో సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ అయితే జోరుగా జరుగుతోంది. నిర్మాతల పరంగా కూడా కొత్త కాంబినేషన్ ఉంటుందనే ప్రచారం ఫిలిం నగర్ వర్గాల్లో బలంగా ఉంది. హీరోలుగా వెంకటేష్, ఫహద్ ఫాసిల్ దాదాపు ఫిక్స్ అయినట్టేనని అంటున్నారు. కార్తీని ట్రై చేశారు కానీ డేట్లు లేవని వినికిడి.

ఈసారి కూడా రావిపూడి పూర్తి ఫన్ మీదే ఆధారపడబోతున్నారు. సంక్రాంతి పండక్కు ఎలాంటి కంటెంట్ కావాలో అలాంటిదే మళ్ళీ సిద్ధం చేస్తున్నారట. ఎఫ్2, ఎఫ్3, సంక్రాంతికి వస్తున్నాం తర్వాత వెంకీతో నాలుగో మూవీ కావడంతో అంచనాలు మాములుగా లేవు.

ఇందులో వెంకటేష్, ఫహద్ ఫాసిల్ బావ బావమరుదులుగా నటించబోతున్నట్టు ఇన్ సైడ్ లీక్. రెండు కుటుంబాల మధ్య ఎంటర్ టైన్మెంట్ కి చిన్న యాక్షన్ ఎలిమెంట్ కి ముడిపెట్టి అనిల్ రావిపూడి తనదైన స్టైల్ లో వడ్డించబోతున్నట్టు తెలిసింది. హీరోయిన్లకు కూడా చెప్పుకోదగ్గ ప్రాధాన్యం ఉంటుందట.

ఈ రెండు జంటల మధ్య పేలిపోయే ఎపిసోడ్స్ ఉంటాయని అంటున్నారు. ఇంకా షూటింగ్ ప్రారంభం కాని దశలో ఇంతకన్నా ఇన్ఫో దొరకదు కానీ మొత్తానికి మరోసారి పండగ యుద్ధానికి రావిపూడి టీమ్ రెడీ అవుతోంది. వెంకీ అభిమానులు దీన్ని మల్టీస్టారర్ గా సంబోదించడానికి ఇష్టపడటం లేదు.

మార్చి లేదా ఏప్రిల్ నుంచి మొదలుపెట్టి ఆరేడు నెలల్లో షూట్ పూర్తి చేసేలా అనిల్ రావిపూడి దగ్గర పక్కా ప్లాన్ ఉందట. చిరంజీవి అంతటి అగ్ర హీరోనే పరుగులు పెట్టించినప్పుడు తనకు బాగా సింక్ అయిన వెంకటేష్ తో ఇంకెంత స్పీడ్ చూపిస్తాడో వేరే చెప్పాలా. భీమ్స్ త్వరలోనే మ్యూజిక్ సిట్టింగ్స్ చేయబోతున్నారు.

2027 సంక్రాంతికి ఎంత పెద్ద కాంపిటీషన్ ఉన్నా సరే అనిల్ ఎప్పటిలాగే వెనుకడుగు వేసే ఛాన్స్ ఉండదు. చిరంజీవి – బాబీ, బాలకృష్ణ – గోపీచంద్ మలినేని సినిమాలు కూడా అదే సీజన్ లో వస్తాయనే వార్తలు తిరుగుతున్న నేపథ్యంలో మొత్తం ముగ్గురు అగ్ర హీరోలు బరిలో ఉంటారనే అంచనాలు బలంగా ఉన్నాయి.