రెండు షాట్ల కోసం మహేష్ ఆరు నెలల కష్టం

రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు.. ఈ వార్త నిజం కావడానికి దశాబ్దంన్నర పాటు ఎదురు చూడాల్సి వచ్చింది అభిమానులు. వీరి కలయికలో సినిమా గురించి 2010 ప్రాంతంలోనే వార్తలు వచ్చాయి. కానీ రకరకాల కారణాలతో ఈ కాంబినేషన్ ఆలస్యం అయింది. ఐతే ఆ లేటు కూడా మంచికే అయిందని అందరూ అనుకుంటున్నారిప్పుడు.

రాజమౌళి ‘బాహుబలి’తో ఇండియాస్ బిగ్గెస్ట్ డైరెక్టర్‌గా ఎదిగి, ‘ఆర్ఆర్ఆర్’తో అంతర్జాతీయ మార్కెట్‌నూ కొల్లగొట్టాక ఆయన దర్శకత్వంలో నటించే అవకాశం మహేష్‌కు దక్కింది. ఈ సినిమా మొదలైంది గత ఏడాది అయినా.. అంతకు ఏడాదిన్నర ముందు నుంచే ప్రిపరేషన్ మొదలుపెట్టాడు మహేష్.

ఇందుకోసం ఎంత కష్టపడ్డాడో ‘వారణాసి’ టీంతో కలిసి ఒక హాలీవుడ్ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మహేష్ వెల్లడించాడు. సినిమాలో కేవలం రెండు షాట్స్ కోసం ఆరు నెలల పాటు ట్రైనింగ్ తీసుకున్నట్లుగా మహేష్ చెప్పడం విశేషం.

వారణాసి సినిమాలో తన లుక్స్ కోసం ఎన్నో రిహార్సల్స్ చేశామని, 2024 నుంచి ఇదే పనిలో ఉన్నామని మహేష్ తెలిపాడు. గత ఏడాది ఈ పని మీదే జర్మనీకి వెళ్లామని.. రాజమౌళి ప్రతి చిన్న విషయాన్నీ క్షుణ్ణంగా పరిశీలిస్తారని.. ఎన్నిసార్లయినా రిహార్సల్స్ చేస్తారని మహేష్ చెప్పాడు.

ఈ చిత్రంలో తాను రాముడి పాత్ర చేశానని.. రాముడంటేనే హుందాతనం అని.. ఆయనకు ప్రత్యేకమైన భంగిమ ఉంటుందని.. కాబట్టే నిలబడే విధానం దగ్గర్నుంచి ఆ పాత్రలో నటించడం వరకు చాలా రిహార్సల్స్ చేయాల్సి వచ్చిందని.. 2, 3 నెలల పాటు దాని కోసమే కష్టపడ్డామని మహేష్ వెల్లడించాడు.

తాను పరుగెత్తే విధానాన్ని రాజమౌళి మార్చాడని.. దాని కోసం ఆరు నెలల పాటు ట్రైనింగ్ తీసుకున్నానని.. ఆ తర్వాత షూట్ చేస్తే పడ్డ కష్టానికి ఫలితం వచ్చినట్లు అనిపించిందని మహేష్ చెప్పాడు. కేవలం రెండు షాట్ల కోసమే ఈ ఆరు నెలల కష్టమంతా అని.. సినిమాపై రాజమౌళికి ఎంత శ్రద్ధ ఉందో చెప్పడానికి ఈ ఒక్క విషయం చాలని.. ఆయన ఎన్నో వర్క్‌షాప్‌లు కూడా నిర్వహించాడని మహేష్ తెలిపాడు.