కపుల్ ఫ్రెండ్లీ లక్ష్యానికి ప్రభాస్ అండ

ఫిబ్రవరి 14 కపుల్ ఫ్రెండ్లీ విడుదల కానుంది. సక్సెస్ పరంగా హీరో సంతోష్ శోభన్ కు ఇది చాలా కీలకం. చెప్పుకోదగ్గ కౌంట్ లో సినిమాలు చేసినా సక్సెస్ అందని ద్రాక్షగా మిగిలిపోవడంతో ఈసారి కొంచెం గ్యాప్ తీసుకుని మంచి కంటెంట్ తో వస్తున్న నమ్మకాన్ని కపుల్ ఫ్రెండ్లీ ట్రైలర్ కలిగించింది.

తెలుగు తమిళ భాషల్లో సమాంతరంగా రిలీజ్ కాబోతున్న ఈ యూత్ ఫుల్ డ్రామాలో లివిన్ రిలేషన్ ని హైలైట్ చేయబోతున్నారు. సాధారణంగా హైఫై ఫ్యామిలీస్ లో చూపించే సహా జీవనం కాకుండా ఒక మాములు మధ్య తరగతి ప్రేమకథకి దీన్ని ముడిపెట్టి  దర్శకుడు అశ్విన్ చంద్రశేఖర్ కొత్తగా ప్రెజెంట్ చేసినట్టు కనిపిస్తోంది.

యువి క్రియేషన్స్ ప్రభాస్ కు ఎంత సన్నిహిత సంస్థనో చెప్పనక్కర్లేదు. సంతోష్ శోభన్ కు డార్లింగ్ మద్దతు ముందు నుంచి ఉంది. తన కెరీర్ లో మొదటి బ్లాక్ బస్టర్ ‘వర్షం’ దర్శకుడు శోభన్ స్వయంగా సంతోష్ తండ్రి కావడం వల్ల ఆ అభిమానాన్ని ఇప్పటికీ కొనసాగిస్తూ ఉంటాడు.

గతంలో ఇదే బ్యానర్ సోదరి సంస్థ యువి కాన్సెప్ట్స్ కింద కళ్యాణం కమనీయం, మంచి రోజులు వచ్చాయి, ఏక్ మినీ కథ సంతోష్ శోభన్ తోనే తీశారు. ఇప్పుడు కపుల్ ఫ్రెండ్లీ కూడా అదే కోవలో వస్తోంది. దీన్ని బట్టే ప్రభాస్ టీమ్ ఇతనికి ఎంత బ్యాకప్ గా నిలుస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. హిట్టు పడటం ఒకటే ఆలస్యం లెక్క సరిపోతుంది.

ప్రేమికుల రోజు, అందులోనూ బాక్సాఫీస్ సరైన కంటెంట్ కోసం ఎదురు చూస్తున్న టైంలో కపుల్ ఫ్రెండ్లీ రిలీజ్ కావడం బిజినెస్ పరంగా సానుకూలంగా కనిపిస్తోంది. క్లిక్ అయితే మాత్రం లిటిల్ హార్ట్స్ తరహాలో సర్ప్రైజ్ హిట్ అందుకోవచ్చు. ఒక రోజు ముందు విశ్వక్ సేన్ ఫంకీ తప్ప చెప్పుకోదగ్గ కాంపిటీషన్ లేదు కాబట్టి ఆ అడ్వాంటేజ్ ని ఏ మేరకు వాడుకుంటారో చూడాలి.

మానస వారణాసి హీరోయిన్ గా నటించిన ఈ మూవీలో రాజీవ్ కనకాల, గోపరాజు రమణ తదితరులు ఇతర పాత్రలు పోషించారు. ఆదిత్య రవీంద్రన్ సంగీతం మీద మంచి మంచి బజ్ ఏర్పడుతోంది. చూడాలి మరి ఈ ఫ్రెండ్లీ కపుల్ తమ గోల్స్ ని ఎలా చేరుకోబోతున్నాయో.