భారత్, పాకిస్థాన్ మధ్య చాలా ఏళ్లుగా సంబంధాలు అంతంతమాత్రంగా ఉండగా.. గత ఏడాది పహల్గాం దాడితో అవి మరింత క్షీణించాయి. ఈ నేపథ్యంలో రెండు దేశాల మధ్య సినిమా సంబంధాలు కూడా తెగిపోయాయి. ఒకప్పట్లా పాకిస్థాన్ నటీనటులు ఇండియాలో సినిమాలు చేయట్లేదు. అలాగే ఇండియన్ మూవీస్ పాకిస్థాన్‌లో రిలీజ్ కావట్లేదు.
ఐతే హిందీ సినిమాలకు బాగా అలవాటు పడ్డ పాకిస్థానీలు .. వాటిని ఏదో రకంగా చూడడానికే ప్రయత్నిస్తున్నారు. ఐతే వేరే సినిమాలు అంటే ఓకే కానీ.. పాకిస్థాన్, ఆ దేశీయులను విలన్‌గా చూపించిన సినిమాను ఎగబడి చూడడం మాత్రం ఆశ్చర్యం కలిగించే విషయమే. దురంధర్ సినిమా విషయంలో ఇదే జరిగింది.
పాకిస్థాన్‌లో ఈ సినిమా రిలీజ్ కాకపోయినా.. ఆన్ లైన్లో పైరసీ వెర్షన్‌ను పాకిస్థాన్‌లో పెద్ద ఎత్తున డౌన్ లోడ్ చేసుకుని చూసినట్లు వెల్లడైంది. ఒక డేటా ప్రకారం ఇప్పటిదాకా పాకిస్థాన్‌లో దురంధర్ పైరసీ వెర్షన్ డౌన్‌లోడ్‌లు 20 లక్షలు దాటిపోయాయని వార్తలు వచ్చాయి.
ఈ సినిమా పూర్తిగా పాక్‌కు వ్యతిరేకంగానే ఉంటుందీ. చిత్రం కథ అంతా కూడా పాకిస్థాన్ నేపథ్యంలోనే సాగుతుంది. అయినా సరే.. పాకిస్థానీలు ఈ సినిమాను పెద్ద ఎత్తున చూశారు, చూస్తూనే ఉన్నారు. ఇటీవలే దురంధర్ నెట్‌ఫ్లిక్స్ ద్వారా డిజిటల్‌గా రిలీజైంది. అప్పట్నుంచి పాకిస్థాన్‌లో నెట్ ఫ్లిక్స్ నంబర్‌వన్‌గా కొనసాగుతున్నది దురంధర్ మూవీనే. దీన్ని బట్టి ఈ చిత్రాన్ని అక్కడి వాళ్లు ఎంతగా ఎగబడి చూస్తున్నారో అర్థం చేసుకోవచ్చు.
విశేషం ఏంటంటే.. పాకిస్థాన్‌లో నెట్‌ఫ్లిక్స్ నంబర్ 2 కూడా బాలీవుడ్ మూవీనే. ధనుష్, కృతి సనన్ జంటగా నటించిన ప్రేమకథా చిత్రం తేరే ఇష్క్ మే.. దురంధర్ తర్వాతి స్థానంలో ట్రెండ్ అవుతోంది. ఈ డేటా చూసి పాకిస్థానీలకు బాలీవుడ్ సినిమాలే దిక్కు అని.. తమకు వ్యతిరేకంగా తీసిన సినిమాను కూడా ఈ స్థాయిలో ఆదరించడం వారికే చెల్లింది అంటూ భారత నెటిజన్లు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates