సాయిపల్లవి అండ్ టీమ్‌కు పెద్ద ప్రమాదమే తప్పింది

శేఖర్ కమ్ముల డైరెక్షన్‌లో భానుమతిగా పరిచయమై, అందర్నీ ‘ఫిదా’ చేసేసిన సాయిపల్లవి పుట్టినరోజు నేడు. ‘ఫిదా’ మూవీ తర్వాత ఈ హైబ్రీడ్ పిల్లకు టాలీవుడ్‌లో వచ్చిన క్రేజ్ అంతా ఇంతా కాదు. అయితే మిగిలిన హీరోయిన్లలా ఈ ఫాలోయింగ్‌ను ఇష్టమొచ్చినట్టుగా వాడుకోకుండా చాలా సెలక్టివ్‌గా పాత్రలను ఎంచుకుంటోంది సాయిపల్లవి.

ప్రస్తుతం ఆమె చేతిలో రెండు తెలుగు సినిమాలు ఉన్నాయి. ఒకటి శేఖర్ కమ్ముల డైరెక్షన్‌లో నాగచైతన్యంతో చేస్తున్న ‘లవ్ స్టోరీ’ కాగా, మరోటి రానా దగ్గుపాటి హీరోగా రూపొందుతున్న ‘విరాట పర్వం’. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో రూపొందుతున్న ‘విరాటపర్వం’ మూవీ షూటింగ్‌లో పెను ప్రమాదం నుంచి లక్కీగా ఎస్కేప్ అయ్యిందట సాయిపల్లవి అండ్ టీమ్.

‘విరాట పర్వం’ షూటింగ్ దాదాపు పూర్తి కావచ్చింది. కేవలం రానా దగ్గుపాటి పార్ట్‌కి సంబంధించిన 8 రోజుల షూటింగ్ మాత్రమే మిగిలి ఉందని సమాచారం. మావోయిస్ట్ కథాంశంతో రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించిన 50 శాతం షూటింగ్ వికారాబాద్, వరంగల్, కేరళ అడవుల్లో తెరకెక్కించారు.

కొన్ని నెలల క్రితం కేరళ అడవుల్లో షూటింగ్ చేస్తున్న సమయంలో యూనిట్‌కు చిత్రమైన అనుభవం ఎదురైందట. షూటింగ్ ముగించుకుని హోటల్‌కి తిరిగి వస్తున్న సమయంలో ఏకంగా 20 ఏనుగులు ఎదురయ్యాయట. ఒక్కసారిగా ఏనుగుల గుంపును చూడగానే చిత్రయూనిట్‌కు గుండె ఆగిపోయినంత పనైందట. దాంతో షూటింగ్ సామానంతా ఎక్కడివక్కడ వదిలేసి, చెట్టుకొకరు పుట్టకొకరు పరుగెత్తారట.

అలా దాదాపు అరకిలోమీటరు పరుగెత్తి దాక్కున్నారట. నిజానికి ‘విరాటపర్వం’ షూటింగ్ జరిపిన ఏరియాలో ప్రతీరోజు సాయంత్రం 6 గంటల తర్వాత ఏనుగుల సంచారం ఉంటుంది. అయితే ఆ విషయం తెలియని చిత్రయూనిట్… షూటింగ్ కోసం అక్కడికి వెళ్లి లక్కీగా ఎస్కేప్ అయ్యారు. ఈ సంఘటన జరిగిన సమయంలో హీరోయిన్ సాయిపల్లవితో పాటు డైరెక్టర్ వేణు ఉడుగుల, చిత్రయూనిట్ ఉన్నారు. ఇది జరగడానికి కొద్దిసేపటి ముందే రానా దగ్గుపాటి అక్కడి నుంచి వెళ్లాడట.

సాయిపల్లవి పుట్టినరోజు సందర్భంగా ‘అమరవీరులకు జోహార్లు’ అని రాసిఉన్న మావోయిస్టు స్థూపం దగ్గర… పల్లెటూరి పడుచు గెటప్‌లో కూర్చున్న సాయిపల్లవి పోస్టర్‌ను విడుదల చేసింది ‘విరాట పర్వం’ చిత్రయూనిట్.