కరోనా కట్టడికి రైల్వే బ్రిలియంట్ ఐడియా

దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో భారతీయ రైల్వే ఓ అద్భుతమైన ఆలోచన చేసింది. లాక్ డౌన్ కారణంగా రైళ్ల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. దాంతో స్టేషన్లలో నిరూపయోగంగా పడి ఉన్న  రైల్వే బోగీలను కరోనా బాధితుల కోసం ఐసోలేషన్ వార్డులుగా మార్చబోతున్నారు.

ఇందుకోసం ఇప్పటికే కావల్సిన ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. శుక్రవారం నాటికి దేశవ్యాప్తంగా నమోదైన కేసుల సంఖ్య దాదాపు 900 దాకా ఉంది. శని, ఆది వారాల్లో ఈ సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉందని గణాంకాలను చూస్తుంటే అర్థమవుతోంది. దాంతో పెరుగుతున్న కరోనా బాధితుల చికిత్స కోసం బోగీలను ఐసోలేషన్ వార్డులుగా మారుస్తున్నారు రైల్వే సిబ్బంది.

దీనికోసం ప్రతీ క్యాబిన్‌లో ఉండే అదనపు బెర్తులను తొలగించి, ఒకే బెర్తు ఉండేలా చేయడమే కాకుండా నిచ్చెనలు, తదితర అదనపు ఫిట్టింగ్‌లను తొలగిస్తున్నారు. ప్రత్యేక టాయిలెట్లను కూడా ఏర్పాటు చేస్తున్నారు. దీంతో ఒక్కో బోగీలో దాదాపు 20 మంది దాకా రోగులను పెట్టి, చికిత్స చేసే అవకాశం ఉంటుంది. భారతీయ రైల్వే చేసిన ఈ ఆలోచన బాగున్నప్పటికీ, దేశంలో కరోనా కేసులు రోజురోజుకీ పెరుగుతుండడంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. అయితే జాగ్రత్తలు తీసుకుంటే ఇళ్లల్లోనే ఉంటే, భయపడాల్సిన అవసరం లేదంటున్నారు అధికారులు.