రూటు మార్చిన లోన్ యాప్ నిర్వాహకులు

ఇచ్చిన అప్పును తిరిగి వసూలు చేసుకునే విషయంలో లోన్ యాప్ నిర్వాహకులు రూటు మార్చినట్లు అనుమానంగా ఉంది. లోన్ యాప్ అనేది ఇపుడు సమాజానికి పట్టిన పెద్ద చీడగా కనిపిస్తోంది. ఎలాంటి డాక్యుమెంట్లు లేకపోయినా, గ్యారంటార్లు లేకపోయినా, సంతకాలు లేకపోయినా యాప్ నిర్వాహకులు వేల రూపాయలు అప్పులిచ్చేస్తున్నారు. అప్పు ఇచ్చేటపుడు అప్పు తీసుకుంటున్న వ్యక్తి ఫొటో, భార్య, తల్లిదండ్రుల ఫోటోలు, ఆధార్ కార్డు నెంబర్లతో పాటు మొబైల్ కాంటాక్టు చొరబడేందుకు యాక్సెస్ కూడా తీసుకుంటున్నారు.

అప్పు తీసుకున్న వ్యక్తి తిరిగి చెల్లించటం ఒక్కరోజు ఆలస్యమైనా ఇక బండ బూతులతో విరుచుకుపడిపోతున్నారు. అంతేకాకుండా అప్పు తీసుకున్న వాళ్ళ ఫొటోలతో పాటు భార్య, తల్లి, దండ్రుల ఫొటోలను కూడా మార్ఫింగ్ చేసి కాంటాక్టులిస్టులోని అందరికీ పంపుతున్నారు. దాంతో అవమానంగా భావిస్తున్న వారంతా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అప్పటికే తీసుకున్న అప్పుకు మించే చెల్లించామని అప్పుతీసుకున్న వారు ఎంతమొత్తుకుంటున్నా యాప్ నిర్వాహకులు ఏమాత్రం పట్టించుకోవటంలేదు.

సీన్ కట్ చేస్తే ఎవరో తీసుకున్న అప్పు తీర్చాలంటు మంత్రి కాకాణి గోవర్ధనరెడ్డి, మాజీమంత్రి అనిల్ కుమార్ యాదవ్ కు లోన్ యాన్ నిర్వాహకులు ఫోన్ చేయటం సంచలనంగా మారింది. ఫోన్ చేసిన వ్యక్తులు అప్పు తీర్చాలని మంత్రి, ఎంఎల్ఏని కూడా బెదిరించటమే విచిత్రం. ఎవరో తీసుకున్న అప్పును తామెందుకు తీర్చాలని మంత్రి, ఎంఎల్ఏ అడిగినా నిర్వాహకులు పట్టించుకోవటంలేదు. అయితే ఇక్కడే నిర్వాహకుల అసలు వ్యూహం బయటపడుతోంది.

ఇంతకీ విషయం ఏమిటంటే ఎవరో తీసుకున్న అప్పును తీర్చమని నిర్వాహకులు ప్రముఖులను ఎందుకు అడుగుతున్నట్లు ? ఎందుకంటే నిర్వాహకుల బాధ పడలేక సదరు ప్రముఖులు అప్పుతీసుకున్న వ్యక్తులకు ఫోన్ చేసి గట్టిగా మాట్లాడి ఆ డబ్బును తిరిగి ఇప్పిస్తారనేది వీళ్ళ వ్యూహం. లేదా ఎవరో తీసుకున్న అప్పును తమ బాధలు పడలేక ఈ ప్రముఖులన్నా తీర్చేస్తారన్నది రెండో ఆలోచన.