ఏపీ రాజధాని అమరావతికి భూములు ఇచ్చిన రైతులకు భారీ ఊరట లభించింది. ఈ మేరకు.. సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆ వెంటనే అధికారులు కూడా జీవో పాస్ చేశారు. 2015-16 మధ్య అమరావతి నిర్మాణం కోసం.. 33 వేల ఎకరాలకు పైగా భూములను రైతులు త్యాగం చేసిన విషయం తెలిసిందే. ఆయా భూములను ప్రభుత్వం ల్యాండ్ పూలింగ్(సేకరణ) విధానంలో తీసుకుంది. ఈ నేపథ్యంలోనే రైతులకు కొన్ని సౌకర్యాలు కల్పించింది. వారికి రాజధాని పూర్తయ్యే వరకు.. సుమారు 10 సంవత్సరాల పాటు కౌలు ఇస్తామని ప్రకటించింది.
అయితే.. గత వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానుల పేరుతో అమరావతిని అటకెక్కించిన నేపథ్యంలో రైతులకు కౌలు కూడా దక్కలేదు., ఇప్పుడు ఆ బకాయి ఉన్న కౌలు సొమ్మును అందించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. అదేసమయంలో మరోకీలక అంశాన్ని కూడా పరిష్కరించారు. గతంలో అసైన్డ్ భూములను ల్యాండ్ పూలింగ్ ద్వారా సీఆర్డీయే కు ఇచ్చిన వారికి రిటర్నబుల్ ప్లాట్ లలో ‘అసైన్డ్’ అని ప్రభుత్వం పేర్కొంది. ‘అసైన్డ్’ అని ఉండటంతో తమ ప్లాట్ లు అమ్ముడు పోవడం లేదని రైతులు గగ్గోలు పెడుతున్నారు.
అంతేకాదు.. అసైన్డ్ భూములకు.. బ్యాంకులు కూడా రుణాలు ఇవ్వడం లేదు. ఈ నేపథ్యంలో కొన్నాళ్లుగా రైతులు ఉద్యమిస్తున్నారు. ఈ విషయంపై కసరత్తు చేసిన సీఎం చంద్రబాబు.. తాజాగా అసైన్డ్ రైతులు ఇచ్చిన భూములకు కూడా రిటర్నబుల్ ప్లాట్ల లో ‘అసైన్డ్’ అనే పదం తీసివేసి పట్టా భూమి అని పేర్కొనాలని సూచించారు. దీంతో వెంటనే అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకున్నారు. ల్యాండ్ పూలింగ్ చట్టంలోని నిబంధన 9(24) లో ఉన్న నంబర్ 7, రూల్ నంబర్ 11 (4) క్లాజ్ ను మారుస్తూ జీవో జారీ చేశారు.
దీని ప్రకారం.. రాజధానికి భూములు ఇచ్చిన రైతులకు.. ఇచ్చిన పట్టాల్లో ఇక నుంచి అసైన్డ్ అనే పదం ఉండదు. దీంతో రైతులు.. సదరు బూములను లేదాప్లాట్లను బ్యాంకుల్లో తనఖా పెట్టుకుని రుణాలు పొందే అవకాశం ఉంటుంది. అదేసమయంలో ఆయా భూములను విక్రయించుకునేందుకు కూడా అవకాశం ఉంటుంది. కాగా.. ఇప్పటిక సేకరించిన 33 వేల ఎకరాలకు తోడుగా మరో 44 వేల ఎకరాలను సేకరించాలని.. ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అయితే.. 44 వేల ఎకరాలను ఇచ్చేందుకు రైతులు ఈ కారణంగానే ముందుకు రాలేదు. ఇప్పుడు ఆ సమస్య కూడా తీరుతుందని అధికారులు చెబుతున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates