జ‌గ‌న్ కు అడిగే అర్హ‌తే లేదంటున్న బాబు

జ‌గ‌న్ కు అడిగే అర్హ‌తే లేదంటున్న బాబు

స‌మ‌ర‌దీక్ష పేరిట‌.. త‌న ఏడాది పాల‌న‌పై నిప్పులు చెరుగుతున్న జ‌గ‌న్‌పై ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ఏ మాత్రం ఆల‌స్యం చేయ‌కుండా విరుచుకుప‌డుతున్నారు. ఏడాది బాబు పాల‌న‌లో చేసిందేమీ లేద‌ని.. ఆయ‌నిచ్చిన హామీల్లో ఒక్క‌టంటే ఒక్క‌టి కూడా అమ‌లు చేయ‌లేదంటూ మండిప‌డిన జ‌గ‌న్ పై.. బాబు తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు.

ఆ మాట‌కు వ‌స్తే.. జ‌గ‌న్‌కు ప్ర‌శ్నించే అర్హ‌తే లేద‌ని చంద్ర‌బాబు తేల్చేశారు. కోర్టుల చుట్టూ తిరిగే జ‌గ‌న్ కు ప్ర‌శ్నించే అర్హ‌త లేద‌న్నారు. స‌మైక్య ఆంధ్ర నినాద‌మ‌న్న జ‌గ‌న్‌.. తెలంగాణ‌లో కేసీఆర్ తో ఎలా చేతులు క‌లిపార‌ని ప్ర‌శ్నించారు. ఎంత త‌న‌ను విమ‌ర్శిస్తే మాత్రం.. అస‌లు ప్ర‌శ్నించే అధికారం జ‌గ‌న్ లేద‌ని బాబు అన‌టంలో అర్థం లేద‌న్న వాద‌న‌లు వినిపిస్తున్నాయి.

రాజ‌కీయ నాయ‌కుడు అన్న త‌ర్వాత కేసులు.. కోర్టుల చుట్టూ తిర‌గ‌టం అన్న‌ది మామూలైన‌ప్పుడు.. విమ‌ర్శించే అర్హ‌త లేద‌న‌టం స‌రికాదంటున్నారు. ఆ మాట‌కు వ‌స్తే.. టీటీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఓటుకు నోటు వ్య‌వ‌హారంలో జైలుకు వెళ్లారు. రేపొద్దున్న కోర్టుల చుట్టూ తిర‌గాల్సిన ప‌రిస్థితి. మ‌రి.. భ‌విష్య‌త్తులో రేవంత్‌కు విమ‌ర్శించే అర్హ‌తే లేదంటే చంద్ర‌బాబు దానికేం చెబుతారు.

త‌న పాల‌న బాగోలేద‌ని విమ‌ర్శించే నేత‌పై విమ‌ర్శ‌లు చేసే స‌మ‌యంలో.. తాను చేసిన అభివృద్ధి కార్య‌క్ర‌మాలు.. చేప‌ట్టిన ప‌థ‌కాల గురించి చెప్పుకోవాలే త‌ప్పించి.. ఇలా అర్హ‌త లేద‌ని.. మాట్లాడ‌ట‌మే ఉండ‌కూడ‌ద‌ని వ్యాఖ్యానించ‌టం స‌రికాదన్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.

 

TAGS

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు