ఇది జగన్ ప్రజాబాలెట్

ఇది జగన్ ప్రజాబాలెట్

ఏపీ రాష్ట్ర స‌ర్కారు కొలువుదీరి ఏడాది పూర్తయిన నేప‌థ్యంలో.. ఈ ఏడాది కాలంలో ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల్ని ఎండ‌గ‌ట్టేందుకు.. ఎన్నిక‌ల స‌మ‌యంలో అధికార‌పార్టీ ఇచ్చిన హామీల్ని.. వాటిని ఎంత‌మేర నెర‌వేర్చాన్న అంశంపై వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జ‌గ‌న్ విరుచుకుప‌డ్డారు.

మండుతున్న ఎండ‌ల్ని లెక్క చేయ‌కుండా తాను చేస్తున్న స‌మ‌ర‌దీక్ష‌కు వ‌చ్చిన ప్ర‌జ‌ల‌కు జ‌గ‌న్ థ్యాంక్స్ చెప్పారు. బాబు మోసాల్ని ఎండ‌గ‌ట్టి.. ఎన్నిక‌ల సంద‌ర్భంగా ఆయ‌న ఇచ్చిన హామీల్ని నెర‌వేర్చ‌టంలో దొర్లిన వైఫ‌ల్యాల్ని ఎండ‌గ‌ట్టే ప్ర‌య‌త్నాన్ని జ‌గ‌న్ చేశారు. ఏడాది కాలంలో చంద్ర‌బాబు ఏమీ చేయ‌లేద‌న్న విష‌యాన్ని చెప్పేందుకు ఆయ‌న తీవ్రంగా ప్ర‌య‌త్నించారు. ఇందులో భాగంగా బాబు స‌ర్కారుపై విమ‌ర్శ‌ల మీద విమ‌ర్శ‌లు సంధించారు. ప్రజా బాలెట్ అంటూ నూటా పది ప్రశ్నలను ప్రజలకు సంధిస్తూ వీటికి మార్కులు వేసుకుంటూ పోతే బాబు చేసిన తప్పులేంటో, ఆయన పాలన ఎలా ఉందో అర్థమవుతుందని చెబుతూ దానిని విడుదల చేశారు.

తాను చేస్తున్న స‌మ‌ర‌దీక్ష ఎందుకు చేస్తున్నది ప్ర‌జ‌లంద‌రికి తెలిసిన‌ప్ప‌టికీ..ఒక్క వ్య‌క్తికి మాత్రంతెలీద‌ని.. ఆ వ్య‌క్తి ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు అని విమ‌ర్శించారు.బాబు మాట‌ల్నివిన్న రైత‌న్న నిలువుగా మోస‌పోయార‌ని వ్యాఖ్యానించారు. బాబు మాట‌ల్ని న‌మ్మి డ్వాక్రా మ‌హిళ‌లు.. రుణ‌మాఫీ విష‌యంలో రైతులు తీవ్రంగా న‌ష్ట‌పోయార‌ని వ్యాఖ్యానించారు. బాబు మోసాల్ని ప్ర‌జ‌ల దృష్టికి తీసుకెళ్లి.. ఇచ్చిన హామీల్ని నెర‌వేర్చేలా ప్ర‌భుత్వంపై ఒత్తిడిని పెంచే ల‌క్ష్యంతో నిర‌స‌న దీక్ష‌ను నిర్వ‌హిస్తున్న‌ట్లు వెల్ల‌డించారు.

ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇచ్చిన హామీల్ని.. విజ‌యం సాధించిన త‌ర్వాత గాలికి వ‌దిలేశార‌ని తీవ్రంగా విమ‌ర్శించారు. ఏపీలో రైతులు ప‌డుతున్న అస్థ‌లు అన్నీ ఇన్నీ కావ‌ని.. ఈ కార‌ణంతోనే వారు ఆత్మ‌హ‌త్య‌లు చేసుకుంటున్న‌రని ఆరోపించారు. డ్వాక్రా రుణాల‌కు సంబంధించి ప‌ట్ట‌ప‌గ‌లే మ‌హిళ‌ల్ని న‌మ్మించి గొంతు కోసిన ఘ‌న చ‌రిత్ర చంద్ర‌బాబు సొంత‌మ‌ని తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. మొత్తంగా స‌మ‌ర‌దీక్ష పేరుతో ఏపీ ముఖ్య‌మంత్రిని అన్నీ యాంగిల్స్ లోనూ తిట్టే అవ‌కాశాన్ని జ‌గ‌న్ ఏ మాత్రం వదులుకోకుండా ప్ర‌జ‌ల్ని ఆక‌ర్షించే ప్ర‌య‌త్నం చేశారు.

 

TAGS

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు