కెసిఆర్‌కు పుత్రికా గండం

కెసిఆర్‌కు పుత్రికా గండం

తెరాస అధినేత కెసిఆర్‌కు పుత్రికా గండం వాటిల్లనుంది. అసలే పలు సమస్యలతో సతమతమవుతున్న కెసిఆర్‌కు పాపం ఇప్పుడు ఆయన కుమార్తె మరో సమస్యగా తయారు కానుంది. కుమార్తె అంటే స్వంత కుమార్తె కాదుగానీ, ఆయన సోదరుడి కుమార్తె రమ్య ఇప్పుడు ఆయనకు మరో తలనొప్పిగా తయారయ్యింది. తమకు కెసిఆర్‌ వల్ల ప్రాణగండం ఉందంటూ రమ్య డీజీపీకి ఫిర్యాదు చేసింది.
 
గతంలో తెరాస బహిష్కృత నేత చింతాస్వామి కెసిఆర్‌పై ఆగ్రహంతో వెయ్యి డప్పులు`లక్ష చెప్పులు కార్యక్రమాన్ని నిర్వహించతలపెట్టిన సమయంలో తన చెప్పుకూడా ఇందులో ఉంటుందంటూ రమ్య ప్రకటించింది. రమ్య, ఇప్పుడు...  కెసిఆర్‌పై విమర్శల వర్షం కురిపించింది. పార్టీలో కెసిఆర్‌ ఒక నియంతలాగా వ్యవహరిస్తారని, ఇటీవల ఉత్తరాఖండ్‌ వరదల్లో మరణించిన తెలంగాణకు చెందిన భక్తుల విషయంలో కూడా ఆయన స్పందించలేదని విమర్శించారు. ఈ సందర్భంగా వెయ్యి డప్పులు లక్ష చెప్పులు కార్యక్రమంలో తన చెప్పు కూడా ఉంటుందంటూ రమ్య వ్యాఖ్యానించారు. దీంతో ఆగ్రహించిన తెలంగాణ నేతలు రమ్య నివాసాన్ని ముట్టడించారు. కెసిఆర్‌కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడం పట్ల వారు క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్‌ చేశారు.
 
ఈ నేపధ్యంలో తనకు కెసిఆర్‌ వల్ల ప్రాణగండం ఉందంటూ రమ్య డిజీపీకి ఫిర్యాదు చేశారు. కెసిఆర్‌ వైఖరిని ప్రశ్నించినందుకు తమ ఆస్తులపై ఇలా దాడులకు పాల్పడుతున్నట్టు రమ్య తన పిర్యాదులో పేర్కొన్నారు. ‘వెయ్యి డప్పులు-లక్ష చెప్పులు’ పేరుతో చింతాస్వామి తలపెట్టిన దండోరాకు మద్దతు ఇచ్చిందుకు తనకు కెసిఆర్‌ గణాల నుండి బెదిరింపు ఫోన్‌కాల్స్‌ వస్తున్నాయని, కెసిఆర్‌ కుటుంబం నుండి తమకు రక్షణ కల్పించాలంటూ ఆమె డీజిపీని కోరారు. తెలంగాణ రాకముందే కెసిఆర్‌ మహిళలపై దాడులకు దిగుతుంటే ఇక తెలంగాణ వచ్చాక ఏం చేస్తారోనని ఆందోళనగా ఉందని ఆమె వ్యాఖ్యానిస్తున్నారు. ఒకవైపు తెలంగాణ విషయం గురించి తెగ ఆలోచిస్తున్న కెసిఆర్‌కు ఇటీవలే కొడుకు కెటిఆర్‌ వివాదం మరో తలనెప్పిగా తయారయ్యింది. ఇంకోవైపు తెరాస బహిష్కృత నేత చింతాస్వామి ఆయనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. తెరాసలోని కెసిఆర్‌ దళితులను చిన్న చూపు చూస్తారని, వారిని తన కాళ్ల వద్ద కూర్చోబెట్టి, చెప్పులు పెడతారని ఇలా పలు ఫిర్యాదులతో కెసిఆర్‌పై ఈ కేసు నమోదు చేసి ఆయనకు తలనెప్పిగా తయారయ్యారు. మరోవైపు కాంగ్రెస్‌ పార్టీ ఆయన గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. ఒకవేళ కాంగ్రెస్‌ పార్టీ గనుక తెలంగాణ ఇచ్చేస్తే ఇక తాను తెలంగాణ పేరుతో రాజకీయం నడిపేందుకు వీలుపడదు. కాబట్టి ఎక్కడ ప్రత్యేక తెలంగాణ పట్ల కాంగ్రెస్‌ అనుకూలంగా నిర్ణయం తీసేసుకుంటుందోనని ఆయన తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ఇలా పలు సమస్యలతో సతమతమవుతూ ఫామ్‌హౌస్‌నుండి బయటికి రాని కెసిఆర్‌కు ఇప్పుడు రమ్య రూపంలో మరో సమస్య తయారయ్యింది. వీటన్నిటినుండి కెసిఆర్‌ ఎలా తట్టుకుని బయటపడతాడో వేచి చూడాలి!!

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు