నిజమే.. వాళ్ల సంబంధాలు తెగిపోయేవి కావు

నిజమే.. వాళ్ల సంబంధాలు తెగిపోయేవి కావు

కొన్ని సంబంధాలు అంత త్వరగా తెగిపోవు. ఒకవేళ తెగినట్లు కనిపించినా.. ఏదో ఒక రోజు కలుసుకోక మానవు. ఒక విధంగా చెప్పాలంటే వారి మధ్య ఏడం తాత్కలికమే. కాంగ్రెస్.. టీఆర్ఎస్ మధ్య సంబంధాలే చూసుకోండి. 2004లో కాంగ్రెస్ తో జతకట్టిన టీఆర్ఎస్ తర్వాత విడిపోయారు. మళ్లీ 2009 ఎన్నికల నాటికి చంద్రబాబు నాయుడుతో జత కట్టారు. ఎన్నికల తర్వాత ఎవరి దారిన వాళ్లు వెళ్లిపోయారు. తెలంగాణకు కాంగ్రెస్ హైకమాండ్ సానుకూలంగా ఉందన్న వార్తల నేపథ్యంలో.. తెలంగాణ ఇచ్చే పక్షంలో పార్టీని కాంగ్రెస్ లో కలిపేస్తానని ఓపెన్ ఆఫర్ ఇచ్చేశారు కేసీఆర్. నిజానికి ఆ మాట విని అవాక్కైనవాళ్లు ఉన్నారు. తర్వాత అసలు విషయం బయటకు రావటం వేరే విషయం. కుటుంబంలో ఇద్దరి కేంద్రమంత్రి పదవులు.. వగైరా.. వగైరా భారీ ప్యాకేజీకి సోనియమ్మకే దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయ్యింది. ఎందుకంటే.. కేసీఆర్ డిమాండ్లు అలాంటివి. పావలా పెట్టి రూపాయి పావలా సంపాదించుకోవాలనుకునే కాంగ్రెస్ పార్టీకి కేసీఆర్ ఆఫర్ ఏమాత్రం లాభదాయకంగా అనిపించలేదు. తర్వాత ఎవరి దారి వాళ్లు వెళ్లిపోయారు.

తాజాగా.. డిల్లీ తెలంగాణ విషయంలో ఒక నిర్ణయానికి వచ్చిన నేపథ్యంలో.. ఆ మొత్తం క్రెడిట్ ను కాంగ్రెస్ కొట్టేయాలని చూస్తుంది. దీనిపై కేసీఆర్ మహా చిరాగ్గా ఉన్నారట. ఏళ్ల క్రితం తెర వెనక్కి వెళ్లిపోయిన తెలంగాణ వాదాన్ని బయటకు తీసి.. చివరికి రాష్ట్రాన్ని ముక్కలు చేసే స్థాయికి వచ్చిన సమయంలో.. ఆ క్రెడిట్ అంతా కాంగ్రెస్ కోట్టేయాలని చూడటం ఆయనకు సుతారం ఇష్టపడటం లేదు. అందుకే.. కాంగ్రెస్ పై దాడికి సరంజామా సిద్ధం చేసుకుంటున్న సమయంలో కాంగ్రెస్ సీనియర్ నేత డి.శ్రీనివాస్ స్వీట్ షాక్ ఇచ్చారు. కేసీఆర్ తో తమకు మంచి సంబంధాలు ఉన్నాయంటూ.. కేసీఆర్ ను ఇరుకున పెట్టే ప్రయత్నం చేశారు. ఆయనేమన్నారంటే.. ‘‘కాంగ్రెస్ అధిష్ఠానానికి టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ చాలా దగ్గర. యూపీఏ ప్రభుత్వంలో ఆయన కేంద్రమంత్రిగా పని చేశారు. ఒకసారి సంబంధాలు ఏర్పడ్డాక
అవి ఎలా తెగిపోతాయి? తెలంగాణ సాధన కోసం పుట్టిన పార్టీ టీఆర్ఎస్. రాష్ట్ర ఏర్పాటు అయ్యాక వారు వీలీనం అవుతారని ఆశిస్తున్నా’’ అంటూ కేసీఆర్ కు ముందర కాళ్ల బంధం వేసే ప్రయత్నం చేశారు.

డీఎస్ వ్యాఖ్యల్ని పరిశీలించినప్పుడు ఒక్క విషయం అర్థమవుతుంది. కేసీఆర్ తో తమ సంబంధం తెగిపోలేదని.. అది అంత త్వరగా తెగిపోయే రిలేషన్ కాదని చెబుతూ.. తెలంగాణ చాంఫియన్ కాంగ్రెస్ అన్న విషయాన్ని మరోసారి చెప్పే ప్రయత్నం చేశారు. నిజమే.. కాంగ్రెస్ తో ఒకసారి అనుబంధం ఏర్పడ్డాక వారి ఉచ్చు నుంచి వైదొలగటం అంత ఈజీ ఏమీ కాదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు