రివర్స్ లో వెళుతున్న టీడీపీ

రివర్స్ లో వెళుతున్న టీడీపీ

స్ట్రేయిట్ గా వెళితే పనులు కానపుడు రివర్స్ లో వెళ్లాలని సూపర్ హిట్ అయిన ఓ సినిమాలో డైలాగ్ ను టీడీపీ బాగా పాటిస్తున్నట్లుంది. టీడీపీ తరఫున గెలిచి అధికార టీఆర్ఎస్ పార్టీలోకి నయానో భయానో, భవిష్యత్ కోసమో చేరిన తెలుగుదేశం ఎమ్మెల్యేలను అనర్హులగా ప్రకటించాలని టీడీపీ చేయని ప్రయత్నం అంటూ లేదు. రాష్ర్టపతినివెళ్లి కలిశారు, అసెంబ్లీ స్పీకర్ కు ఫిర్యాదు చేశారు. గవర్నర్ ను వినతి పత్రం అందజేశారు. ఎప్పటికపుడు విలేకరుల సమావేశాల్లో ఆయా ఎమ్మెల్యేలపై దుమ్మెత్తిపోస్తున్నారు. అయినప్పటికీ పార్టీ మారిన ఎమ్మెల్యేల రాజీనామా ఆమోదం పొందడం కానీ.. వారిని అనర్హులుగా ప్రకటించడం కానీ ఇప్పటివరకు కానేలేదు.

ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ ఓ సూపర్ ప్లాన్ వేసింది. తమ పార్టీ గుర్తుపై గెలిచి ప్రత్యర్థి పార్టీలో చేరిన వారి తీరును ఎండగట్టాలని నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ఒకే రోజు పార్టీ కార్యకర్తలతో ఆయా ఎమ్మెల్యేల ఇంటిముందు నిరసనను ప్లాన్ చేసింది. ఇది వేరే రోజు చేస్తే మజా ఏముంటుంది అనుకున్నారో ఏమో కానీ..సాక్షాత్తు టీఆర్ఎస్ ప్లీనరీ రోజే ఇందుకు శ్రీకారం చుట్టారు.

ప్లీనరీ ప్రారంభం అవుతున్న సమయంలోనే వేర్వేరు చోట్ల ఉన్న ఆయా ఎమ్మెల్యేల నివాసాలను పచ్చపార్టీ తమ్ముళ్లు నిర్బందించారు. పదవికి రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేశారు. హైదరాబాద్ లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇంటిముందు టీడీపీ నాయకులు నిరసన మొదలుపెట్టారు. టీఆర్ఎస్ లోకి వెళ్లిన తలసాని తన పదవికి రాజీనామా చేయాలంటూ నినాదాలు చేశారు.

రంగారెడ్డి జిల్లా మీర్ పేటలో ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి నివాసం ముందు టీడీపీ నియోజకవర్గ ఇంచార్జీ, ఎంపీ దేవేందర్ గౌడ్ తనయుడు వీరేందర్ గౌడ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కార్యకర్తలు ఇంటిని ముట్టడించారు. గులాబీ కండువా కప్పుకొన్న తీగల పదవికీ రాజీనామా చేయాలంటూ కోరారు. వరంగల్ జిల్లా పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి హన్మకొండలోని ఇంటి ముందు టీడీపీ నేతలు చావు డప్పు కొట్టారు. చెప్పులు, చీపుర్లు, చేతబట్టి డప్పులు వాయిస్తూ పార్టీ మారిన ధర్మారెడ్డి టీడీపీ ద్వారా గెలిచిన పదవికి రాజీనామా చేయాలంటూ నినాదాలు చేశారు.

పార్టీని వంచించిన వారికి తగిన బుద్ధిచెప్పడమే తమ పని అంటూ హెచ్చరించారు. మొత్తానికి తెలుగుదేశం పార్టీ తన రాజకీయ ప్రత్యర్థిపై దూకుడుగానే వెళ్తున్నట్లు కనిపిస్తోంది.

 

TAGS

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు