తెలంగాణ‌వారిపై బాదుడుకు బాబు రెఢీ

తెలంగాణ‌వారిపై బాదుడుకు బాబు రెఢీ

తెలంగాణ ఉద్య‌మం ఉధృతంగా సాగుతున్న రోజుల్లో.. త‌న‌కు రెండు ప్రాంతాలు ఒక‌టేన‌ని ద‌మ్ముగా చెప్పిన వ్య‌క్తి ఎవ‌రైనా ఉన్నారంటే అది టీడీపీ అధినేత చంద్ర‌బాబుమాత్ర‌మే. ప్ర‌స్తుతం ఏపీ ముఖ్య‌మంత్రిగా వ్య‌వ‌హ‌రిస్తున్న ఆయ‌న‌.. రెండుక‌ళ్ల  సిద్ధాంతాన్ని త‌న శ‌క్తి మేర వివ‌రించేందుకు ప్ర‌య‌త్నం చేశారు.

అయితే.. బాబు చెప్పిన రెండుక‌ళ్ల సిద్ధాంతాన్ని ఎంత కామెడీ చేయాలో అంత కామెడీ చేయ‌టంలో బాబు ప్ర‌త్య‌ర్థులు స‌క్సెస్ అయ్యారు. అదే స‌మ‌యంలో త‌న రెండు క‌ళ్ల సిద్ధాంతాన్ని క‌న్వీన్స్  చేయ‌టంలో బాబు ఫెయిల్ కావ‌టం తెలిసిందే. రెండు ప్రాంతాల‌ను రెండు క‌ళ్లుగా.. ఎవ‌రికి ఎలాంటి న‌ష్టం వాటిల్లకుండా విభ‌జ‌న జ‌ర‌గాల‌ని ప‌దే ప‌దే చెప్పిన బాబు మాట‌ల్ని ఎవ‌రూ పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు. నాటి కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ స‌ర్కారు.. ఎంత హ‌డావుడిగా.. ముందు వెనుకా చూడ‌కుండా.. స‌రైన క‌స‌ర‌త్తు చేయ‌కుండా విభ‌జ‌న చ‌ట్టాన్ని రూపొందించింది.. విభ‌జ‌న త‌ర్వాత అంద‌రికి అర్థ‌మవుతోంది.

విభ‌జ‌న‌కు ముందు రెండుక‌ళ్ల సిద్ధాంతాన్ని చెప్పిన బాబు.. విభ‌జ‌న త‌ర్వాత కూడా ఆ ప‌ల్ల‌విని వ‌ద‌ల్లేదు. ఏపీలో అధికారాన్ని ఏ విధంగా అయితే సాధించామో.. తెలంగాణ‌లో కూడా ప‌వ‌ర్ ను చేజిక్కించుకుంటామ‌ని ప‌లుమార్లు ఇప్ప‌టికే ప్ర‌క‌టించారు. ఏపీకి ముఖ్య‌మంత్రిని చేసిన సీమాంధ్ర ప్ర‌జ‌ల కంటే.. భ‌విష్య‌త్తులో పార్టీకి ప‌వ‌ర్ ఇస్తార‌ని ఆశ ఉన్న తెలంగాణ ప్ర‌జ‌ల మీద బాబు కాస్తంత ఎక్కువ శ్ర‌ద్ధ చూపుతున్నార‌న్న విమ‌ర్శ కూడా ఉంది.

అలాంటి చంద్ర‌బాబు.. తాజాగా తెలంగాణ ప్ర‌జ‌లపై భారం మోపేందుకు రెఢీ అయిపోయారు. ఏపీ నుంచి తెలంగాణ‌కు వ‌చ్చే వాహ‌నాల మీద ప‌న్ను విధిస్తూ కేసీఆర్ స‌ర్కారు నిర్ణ‌యం తీసుకోవ‌టం.. దాన్ని వెన‌క్కి తీసుకునే విష‌యంలో స‌సేమిరా అన్న నేప‌థ్యంలో.. తెలంగాణ నుంచి ఏపీకి వాహ‌నాలు వ‌చ్చే వాటిపైనా ప‌న్ను వేయాల‌న్న నిర్ణ‌యాన్ని సూత్ర‌ప్రాయంగా తీసుకున్న‌ట్లు చెబుతున్నారు.

ఈ కార‌ణంగా ఏడాదికి రూ.60కోట్ల మేర తెలంగాణ ప్ర‌జ‌ల మీద భారం వీలుంది. వాస్త‌వ‌కోణంలో చూస్తే ఈ మొత్తం మ‌రి కాస్త ఎక్కువ‌గా ఉండే అవ‌కాశం ఉందన్న అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

తెలంగాణ ప్ర‌జ‌ల మీద ప్రేమ‌.. మ‌మ‌కారం ఉంటే.. బాబు స‌ర్కారు ఎంట్రీటాక్స్ వేయాల్సిన అవ‌స‌రం ఏమిట‌ని ప్ర‌శ్నిస్తున్నారు. త‌ర్కంగా చూస్తే ఈ వాద‌న పెద్ద‌గా నిల‌వ‌న‌ప్ప‌టికీ.. ఏపీ ప్ర‌జ‌ల మీద ఆ్ర‌గ‌హంతో తెలంగాణ స‌ర్కారు భారం వేసింద‌ని..కానీ.. తెలంగాణ ప్ర‌జ‌ల్ని అమితంగా ప్రేమిస్తున్న‌ట్లు చెప్పే బాబు కూడా కేసీఆర్ బాట‌లో న‌డ‌వాల్సిన అవ‌స‌రం ఏమిట‌న్న వాద‌న‌కు మాత్రం స‌మాధానం చెప్ప‌టం కాస్తంత క‌ష్ట‌మే. తెలంగాణ ప్ర‌జ‌ల మీద విధించే ఎంట్రీ టాక్స్ బాదుడుకు బాబు ఏం స‌మాధానం చెప్పుకుంటారో..?

 

TAGS

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు