స‌వాలు విష‌యంలో త‌ల‌సాని తొంద‌ర‌ప‌డ్డారా?

స‌వాలు విష‌యంలో త‌ల‌సాని తొంద‌ర‌ప‌డ్డారా?

చేతిలో ప‌వ‌ర్ ఉంటే ఆ ధీమానే వేరు. ప్ర‌స్తుతం ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేసి మ‌రీ.. తెలంగాణ మంత్రిగా వ్య‌వ‌హ‌రిస్తున్న త‌ల‌సాని శ్రీ‌నివాస్ యాద‌వ్ చాలానే స్పీడ్ గా ఉన్నారు. మంత్రి ప‌ద‌వి వ‌చ్చిన రోజు నుంచి వ్యాపారుల మీద‌.. వారు చెల్లించ‌ని ప‌న్ను మీద ప‌దే ప‌దే వ్యాఖ్య‌లు చేస్తున్న ఆయ‌న‌.. తాజాగా రాజకీయ వ్యాఖ్య‌లు చేశారు.

తెలుగుదేశం టిక్కెట్టు మీద ఎమ్మెల్యేగా గెలిచి.. త‌ర్వాత త‌న ప‌ద‌వికి రాజీనామా చేస్తున్నట్లు స్పీక‌ర్‌కు లేఖ‌ను పంపించి (దాన్ని స్పీక‌ర్ ఇంకా ఆమోదించ‌లేదు) మంత్రి ప‌ద‌వికి ప్ర‌మాణ‌స్వీకారం చేసిన సంగ‌తి తెలిసిందే. పిలిచి ప‌ద‌వి ఇచ్చిన కేసీఆర్ ప‌ట్ల విధేయ‌త‌ను ప్ర‌ద‌ర్శిస్తూ.. ద‌శాబ్దాల త‌ర‌బ‌డి త‌న‌కు రాజ‌కీయం నేత‌గా పేరుప్రఖ్యాతుల్ని అందించిన తెలుగుదేశం మీద తీవ్ర స్థాయిలో విరుచుకుప‌డుతున్నారు.

తాజాగా ఆయ‌న‌.. ఎర్ర‌బెల్లిని టార్గెట్ చేశారు. ఆయ‌న బ్లాక్ మొయిల్ రాజ‌కీయాల‌కు పాల్ప‌డుతున్నార‌ని ధ్వ‌జ‌మెత్తిన త‌ల‌సాని.. ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ను ర‌హ‌స్యంగా ఎందుకు క‌లిశారో చెప్పాల‌న్నారు. తెలంగాణ అభివృద్ధి కోసం తాను టీఆర్ఎస్ లో చేరిన‌ట్లుగా వెల్ల‌డించారు.

తాను కానీ స‌న‌త్‌న‌గ‌ర్‌కు జ‌రిగే ఉప ఎన్నిక‌లో ఓడిపోతే రాజ‌కీయ స‌న్యాసం చేస్తాన‌ని ఆయ‌న ఛాలెంజ్ విసిరారు. త‌ల‌సాని అన్న ఏ మాట‌కు ఆయ‌న అభిమానులు పెద్ద‌గా ఫీల్‌కావ‌టం లేదు కానీ.. స‌న‌త్‌న‌గ‌ర్‌లో ఓడిపోతే రాజ‌కీయ స‌న్యాసం అనే మాట‌కు మాత్రం దిగులు ప‌డుతున్నారు. నిజంగా స‌న‌త్‌న‌గ‌ర్‌లో అంత సానుకూల ప‌రిస్థితి ఉండి ఉంటే ఈపాటికి త‌ల‌సాని రాజీనామాను అంగీక‌రించేసి.. ఉప ఎన్నిక‌కు సిద్ధ‌మ‌య్యే వారే.

అలాంటి సీన్ లేక‌నే క‌దా.. పెండింగ్ పెట్టింద‌న్న వ్యాఖ్య‌ల్ని అధిక‌ర‌ప‌క్ష నేత‌లే చేస్తున్నారు. ఇలాంటి ప‌రిస్థితుల్లో ఎన్నిక‌ల్లో ఓడిపోతే రాజ‌కీయ స‌న్యాసం లాంటి పెద్ద మాట‌లు అవ‌స‌ర‌మా? అని వేద‌న చెందుతున్నారు. స‌వాళ్లు విసిరేట‌ప్పుడు కాస్త ఆచితూచి విస‌రాలే త‌ప్ప‌.. రాజ‌కీయ స‌న్యాసం లాంటి పెద్ద విష‌యాల్ని స‌వాళ్ల‌కు తీసుకొచ్చేస్తారా? అని దిగులు చెందుతున్నారు. చేతిలో ప‌వ‌ర్ ఉంటే.. ఆత్మ‌విశ్వాసం రెట్టింపు అవుతుందిగా. ఆ ఊపులోనే త‌ల‌సాని చెల‌రేగిపోయి ఉంటారు?

 

TAGS

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు