ఐఏఎస్ ల అవినీతి గురించి బహిరంగంగా మాట్లాడేశారు

ఐఏఎస్ ల అవినీతి గురించి బహిరంగంగా మాట్లాడేశారు

ఏపీ ముఖ్య‌మంత్రికి మ‌రో త‌ల‌నొప్పి మొద‌లైంది. ఇప్ప‌టికే ఉన్న స‌మ‌స్య‌లు చాల‌వ‌న్న‌ట్లుగా ఆయ‌న‌కు కొత్త ఇబ్బంది మొద‌లైన‌ట్లే. బాబు ప్రాతినిధ్యం వ‌హిస్తున్న సొంత జిల్లాకు చెందిన ఐఏఎస్ అధికార‌పై తీవ్ర ఆరోప‌ణ‌లు చేయ‌టం గ‌మ‌నార్హం. అదే స‌మ‌యంలో కొంద‌రు ఐఏఎస్ అధికారుల వ్య‌వ‌హ‌రిస్తున్న వైఖ‌రిపై స‌మాచార‌హ‌క్కు చ‌ట్టం క‌మిష‌న‌ర్‌తో స‌హా.. ఐదుగురు క‌మిష‌న‌ర్లు తాజాగా గ‌వ‌ర్న‌ర్ ను క‌లిశారు.

స‌మాచార‌హ‌క్కు చ‌ట్టాన్ని నిర్వీర్యం చేసేలా ఐఏఎస్ అధికారులు వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని వ్యాఖ్యానించారు. కొంద‌రు అధికారులు తెంప‌రిత‌నాన్ని ప్ర‌ద‌ర్శిస్తున్నార‌ని.. స‌మాచార‌హ‌క్కు చ‌ట్టం కింద అడిగిన స‌మాచారాన్ని ఇవ్వ‌కుండా తొక్కి పెడుతున్నార‌ని వ్యాఖ్యానించారు. గ‌వ‌ర్న‌ర్ ను క‌లిసి ఐఏఎస్ అధికారుల‌పై ఫిర్యాదు చేసిన అనంత‌రం.. స‌మాచార‌హ‌క్కు చ‌ట్టం క‌మిష‌న‌ర్ల‌లో ఒక‌రైన విజ‌య‌బాబు మీడియా ముందు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

కొంద‌రు ఐఏఎస్ అధికారులు కావాల‌నే స‌మాచార‌హ‌క్కు చ‌ట్టాన్ని నిర్వీర్యం చేస్తున్నార‌ని.. వారి స్థాయికి మించి భ‌వ‌నాలు నిర్మిస్తున్నార‌ని చెబుతూ.. కొంద‌రు ఐఏఎస్ అధికారుల అవినీతి గురించి ప‌రోక్షంగా ప్ర‌స్తావించారు. స‌మాచార‌హ‌క్కు చ‌ట్టం కింద ద‌ర‌ఖాస్తు చేసుకున్న అంశాల‌కు సంబంధించి వివ‌రాలు ఇచ్చే విష‌యంలో చిత్తూరు జిల్లా క‌లెక్ట‌ర్ వ్య‌వ‌హార‌శైలిని ప్ర‌శ్నించారు.

స‌మాచార‌హ‌క్కు చ‌ట్టాన్ని నిర్వీర్యం చేస్తున్న అంశాల‌కు సంబంధించి ప‌లు ఉదాహ‌ర‌ణ‌లు గ‌వ‌ర్న‌ర్‌కు చూపించామ‌ని.. అధికారుల వ్య‌వ‌హార‌శైలిని త్వ‌ర‌లో ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునుక‌లిసి ఆయ‌న దృష్టికి తీసుకెళ‌తామ‌ని చెప్పారు. అయినా.. ఇలాంటి విష‌యాల్లో నేరుగా చ‌ర్య‌లు తీసుకునే అవ‌కాశం ఉన్న ముఖ్య‌మంత్రిని క‌ల‌వ‌కుండా.. గ‌వ‌ర్న‌ర్‌ను క‌ల‌వ‌టంలో అంత‌ర్యం ఏమిటో..?

 

TAGS

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు