కేసీఆర్‌.. కోదండం మ‌ధ్య ఏం జ‌రిగి ఉంటుంది?

కేసీఆర్‌.. కోదండం మ‌ధ్య ఏం జ‌రిగి ఉంటుంది?

రెండు క‌త్తులు ఒకే ఒర‌లో ప‌ట్ట‌గ‌ల‌వా? సాధ్య‌మే కాదు. అందుకేనేమో.. తెలంగాణ ఉద్య‌మంలో కీల‌క‌భూమిక పోషించి.. తెలంగాణ రాష్ట్ర సాధ‌న‌లో అతి ముఖ్య‌మైన వారు ఇద్ద‌రు. వారిలో ఒక‌రు తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్య‌మంత్రిగా ఉన్న కేసీఆర్ అయితే.. రెండో వ్య‌క్తి.. క‌ళాశాల‌లో అధ్యాప‌క వృత్తిని కొన‌సాగిస్తున్న కోదండ‌రాం.

కోదండ‌రాం విష‌యం చూసేందుకు కాస్త చిత్రంగా ఉంటుంది. ఆయ‌న వ్య‌వ‌హార‌శైలి సినిమాటిక్‌గా ఉంటుంది. సినిమాల్లో క‌నిపించే ఉదాత్త రూపానికి ప్ర‌తినిధిలా ఆయ‌న క‌నిపిస్తారు. న‌మ్మిన సిద్ధాంతం కోసం పోరాడ‌టం.. అందుకోసం ఎంత‌కైనా తెగించ‌టం.. సాధించిన త‌ర్వాత త‌న‌కు ఏమాత్రం సంబంధం లేన‌ట్లుగా.. ప‌ద‌వుల కోసం పాకులాడ‌కుండా ఉండ‌టం కోదండ‌రాంకు మాత్ర‌మే ద‌క్కింది.

సాధార‌ణంగా కోదండ‌రాం స్థానంలో ఉన్న ఎవ‌రైనా తెలంగాణ రాష్ట్రంలో కీల‌క‌భూమిక పోషించేందుకు త‌హ‌త‌హ‌లాడ‌తారు. కానీ.. కోదండం మాష్టారు అందుకు భిన్నం. ఆశ‌యం కోసం పోరాడ‌తారే కానీ.. ప‌ద‌వుల కోసం మాత్రం కాదు.

ఇక్క‌డో ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాన్ని చెప్పాలి. సాధార‌ణంగా ఈ విష‌యాన్ని ఎవ‌రూ ప్ర‌స్తావించ‌రు  కూడా. తెలంగాణ ఉద్య‌మంలో కీల‌క‌భూమిక పోషించి.. తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డిన త‌ర్వాత ప‌ద‌వుల కోసం పాకులాడ‌కుండా.. చివ‌ర‌కు కేసీఆర్ అంత‌టి వ్య‌క్తి స్వ‌యంగా మాంచి ప‌వ‌ర్‌ఫుల్ పోస్ట్ ఇస్తాన‌న్నా.. సున్నితంగా తిర‌స్క‌రించిన ఒక‌రిద్ద‌రిలో కోదండ‌రాం మాష్టారు ఒక‌రు.

అంతేకాదు.. తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డిన త‌ర్వాత‌.. ప్ర‌భుత్వంతో పెద్ద‌గా అంటీముట్ట‌న‌ట్లుగా ఉండ‌టం ఆయ‌న‌కే చెల్లింది. త‌న‌కు తానుగా స్వీయ నియంత్ర‌ణ‌తో తెలంగాణ స‌ర్కారు మీద ప‌ల్లెత్తు మాట అన‌కుండా సంయ‌మ‌నం పాటించ‌కుండా ఉన్న కోదండ‌రాం.. నెల రోజులుగా మాత్రం అప్పుడ‌ప్పుడు శ్లేష వ్యాఖ్య‌లు చేయ‌టం.. నర్మ‌గ‌ర్భ వాద‌న‌లు వినిపించ‌టం లాంటివి షురూ చేశారు.

అలాంటి వ్య‌క్తి.. తాజాగా ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ను క‌లిశారు. దీనికి చాలామంది చాలానే వాద‌న‌లు వినిపించారు. ఊహాగానాలు చేశారు. కానీ.. కేసీఆర్‌ను క‌లిసింది.. త‌న కుమారుడి పెళ్లికి ఆహ్వానించ‌టానికి. కేసీఆర్‌కు స్వ‌యంగా శుభ‌లేఖ‌ను ఇవ్వ‌టానికి క‌లిసిన ఆయ‌న‌.. దాదాపు గంట పాటు మాట్లాడుకున్నారు.

చూశారా.. కేసీఆర్‌.. కోదండ‌రాం ఇద్ద‌రూ గంట సేపు మాట్లాడుకున్నారు. ఇంకేముంది? ఏదో జ‌రిగిపోతుంద‌ని హ‌డావుడి ప‌డిపోయారు. తెలంగాణ ఉద్య‌మం లాంటి సుదీర్ఘ భావోద్వేగ ప్ర‌యాణంలో క‌లిసి ప్ర‌యాణించిన ఇద్ద‌రు వ్య‌క్తులు క‌లిసిన‌ప్పుడు మాట్లాడుకోకుండా ఉంటారా?

ముఖం.. ముఖం చూసుకోని చంద్ర‌బాబుకి.. కేసీఆర్ ఫోన్ చేసి బ‌ర్త్‌డే విషెస్ చెప్పిన వ్య‌క్తి.. ఉద్య‌మ నేత క‌లిసిన‌ప్పుడు ముచ్చ‌ట్లు లేకుండా ఉంటాయా? అందుకే.. కొద్దిసేపు మాట్లాడి ఉండొచ్చు.

అంతేకాదు.. అధికార క్షేత్రానికి బ‌య‌ట ఉన్న కోదండ‌రాం లాంటి వారితోమాట్లాడ‌టం వ‌ల్ల ప్ర‌భుత్వం మీద బ‌య‌ట ఎలాంటి టాక్ ఉంద‌న్న విష‌యంతో పాటు.. పాల‌న‌కు సంబంధించిన పీడ్ బ్యాక్ తెలిసే వీలుంది. మిగిలిన వారి మాదిరి ముఖ‌స్తుతి కోసం కోదండం మాట్లాడ‌ర‌ని కేసీఆర్ కు తెలుసు. అందుకే.. ర‌క‌ర‌కాల అంశాల మీద కాసేపు చ‌ర్చ సాగి ఉంటుంది. ఆమాత్రానికే ఏదో జ‌రిగిపోయింద‌నుకోవ‌టం ఉత్త భ్ర‌మే. ఇద్ద‌రు లోతు మ‌నుషులు క‌లిసి మాట్లాడుకున్న‌ప్పుడు.. ఏ ప‌రిణామాలు వెనువెంట‌నే జ‌రిగిపోవ‌న్న విష‌యం మ‌ర్చిపోకూడ‌దు. గంట మాట‌ల‌తోనే.. ఇద్ద‌రి మ‌ధ్య ఉన్న దూరం త‌గ్గుతుంద‌ని అనుకోవ‌టం కూడా భ్ర‌మే.

 

TAGS

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు