యువ‌రాజుకు సీనియ‌ర్ల స‌ల‌హా మ‌ర్మమేంటి?

యువ‌రాజుకు సీనియ‌ర్ల స‌ల‌హా మ‌ర్మమేంటి?

కాంగ్రెస్‌లో కొత్త జాత‌ర మొద‌లైంది. 56 రోజుల పాటు దేశానికి దూరంగా.. ఎక్క‌డికి వెళ్లారో చెప్ప‌కుండా గ‌డిపి వ‌చ్చిన కాంగ్రెస్ ఉపాధ్య‌క్షుడు రాహుల్ గాంధీ.. స్వ‌దేశానికి రావ‌టం తెలిసిందే.

దేశంలో లేని సంద‌ర్భంగా యువ‌రాజు సామ‌ర్థ్యం మీదా.. నాయ‌క‌త్వం మీదా ప‌లు సందేహాలు వ్య‌క్తం చేసిన సీనియ‌ర్లు ఇప్పుడు ఒక‌రు త‌ర్వాత ఒక‌రుగా స‌ల‌హాలు సూచ‌న‌లు ఇస్తున్నారు. ఇప్పుడు ఆయ‌న క‌లిసే అవ‌కాశం వ‌స్తే చాలు.. స‌ల‌హాలు ఇచ్చేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా వారు రాహుల్‌ను వ్య‌క్తిగ‌త అంశాల విష‌యంలో కూడా సూచ‌న‌లు ఇస్తున్నారు.

విదేశాల‌కు వెళ్లొద్ద‌ని.. భార‌తదేశంలోనే ఉండాలంటూ చెప్ప‌టం కూడా క‌నిపిస్తోంది. కాంగ్రెస్‌ప‌గ్గాలు చేప‌ట్టేందుకు ముహుర్తం సిద్ధం చేయాల‌ని నిర్ణ‌యించిన వేళ‌.. కాంగ్రెస్ రెండుగా చీలిపోయింద‌న్న వాద‌న వినిపిస్తోంది. సీనియ‌ర్లు అంటే రాహుల్ పెద్ద‌గా మ‌క్కువ చూప‌ర‌ని.. కాస్తంత యూత్ ఫోర్స్ తో త‌న అనుచ‌ర గ‌ణాన్ని సిద్ధం చేసుకోవాల‌న్న త‌లంపులో యువ‌రాజు ఉన్న‌ట్లు చెబుతారు.

ఇందులో భాగంగా.. ఆయ‌న సీనియ‌ర్ల‌ను కాస్త దూరంగా పెట్టాల‌ని భావిస్తున్నట్లు స‌మాచారం. ఈ కార‌ణంగానే రాహుల్ పై సీనియ‌ర్లు విమ‌ర్శ‌నాత్మ‌కంగా మాట్లాడుతున్నార‌న్న వాద‌న వినిపిస్తోంది. దీనివ‌ల్ల మంచి క‌న్నా చెడే జ‌రుగుతుంద‌ని అర్థం చేసుకున్న సీనియ‌ర్లు తాజాగా రూటు మార్చిన‌ట్లు చెబుతున్నారు.

అందుకే.. నిన్న‌మొన్న‌టివ‌ర‌కూ రాహుల్ విదేశీ ప‌ర్య‌ట‌న‌ల మీద వ్యాఖ్య‌లు చేసిన దిగ్విజ‌య్ సింగ్ మొద‌లు ప‌లువురు సీనియ‌ర్ నేత‌లు ఇప్పుడు ఆయ‌న‌కు ద‌గ్గ‌రగా ఉండాల‌ని.. స‌న్నిహితంగా మెల‌గాల‌ని భావిస్తున్నారు. ఇందులో భాగంగా స‌ల‌హాల‌తో ఆయ‌న‌కు ద‌గ్గ‌ర కావాల‌ని భావిస్తున్న‌ట్లు చెబుతున్నారు. ఇందుకు అనువైన స్థ‌లం పార్ల‌మెంటు అన్న ఆలోచ‌న‌లో ఉన్న వారు.. రాహుల్ క‌నిపించిన‌ప్పుడు.. ఆయ‌న ప‌క్క‌న కూర్చునే అవ‌కాశం వ‌చ్చిన‌ప్పుడు.. ఏమేం చేయాలో ఏక‌రువు పెడుతున్నార‌ట‌.

దేశం విడిచి వెళ్లొద్ద‌ని.. దేశంలోనే ఉండాల‌ని.. పార్టీకి నాయ‌క‌త్వం వ‌హించాల‌ని.. దేశంలోని మారుమూల ప్రాంతాల్లో ప‌ర్య‌టిస్తూ రైతాంగ స‌మ‌స్య‌ల మీద దృష్టి సారించాల‌ని చెబుతున్నారు.

ఇలా స‌ల‌హాలు ఇచ్చే వారి జాబితా రోజురోజుకీ పెరుగుతుంద‌ని చెబుతున్నారు. సీనియ‌ర్లు ఇచ్చే స‌ల‌హాలకు యువ‌రాజు త‌ల‌పంకించ‌టం.. మ‌రో సంద‌ర్భంలో ప‌ల్చ‌గా న‌వ్వ‌టం.. మ‌రోసారి శ్ర‌ద్ధ‌గా విన్న‌ట్లుగా ఉండ‌టం లాంటి బాడీలాంగ్వేజ్ ప్ర‌ద‌ర్శిస్తున్నార‌ట‌. మొత్తానికి యువ‌రాజులోనే త‌మ భ‌విష్య‌త్తు ఉంద‌న్న విష‌యాన్ని సీనియ‌ర్లు గుర్తించినట్లుంది.

 

TAGS

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు