మంత్రి నారాయణ తెలంగాణ డబ్బులు దొబ్బుతున్నడు

మంత్రి నారాయణ తెలంగాణ డబ్బులు దొబ్బుతున్నడు

తెలంగాణ రాష్ర్ట సమితీలో కీలకనేత అయిన నాయిని నర్సింహారెడ్డి భోళాతనంలోతనకు తానే సాటి అని ప్రతి సందర్భంలోనూ నిరూపించుకుంటారు. పార్టీ అధినేత కేసీఆర్ కు తగ్గట్లు మెలుగుతారు అనే పేరున్న నాయిని..టీఆర్ఎస్ అధ్యక్షుడిగా కేసీఆర్ ఎన్నికయినట్లు ప్రకటించిన అనంతరం విలేకరులతో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గతంలో నారాయణ, శ్రీ చైతన్య విద్యా సంస్థలను తెలంగాణ నుంచి పంపిస్తామని అన్నమీరు ఎందుకు ఆ పనిచేయడం లేదని ఓ విలేకరి ప్రశ్నించగా దానికి నాయిని తనదైన శైలిలో స్పందించారు.

'ఆంధ్రాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలతోనే మాకు తగాదా. ఆంధ్రా ప్రజలతో కాదు. ఇపుడు ఇక్కడ ఉన్న వాళ్లంతా తెలంగాణ వాళ్లే' అని అన్నారు. అలాంటపుడు నారాయణ, శ్రీ చైతన్య వంటి విద్యాసంస్థలను పంపిస్తామన్న సంగతేంటని ప్రశ్నించగా... 'అట్లెవరన్నరు? నారాయణ (ఏపీ మంత్రి) ఇక్కడ కాలేజీలు పెట్టి తెలంగాణ పైసలు కుమ్ముతున్నడు. లక్షలకు లక్షలు ఫీజులు వసూలు చేస్తున్నడు. అది తప్పు. రేపు మా వాళ్లు కూడా ఫీజులు వసూలు చేస్తే తప్పు పడుతం' అని అన్నారు.

అనేకమంది సీమాంధ్ర వారు సైతం టీఆర్ఎస్ లో సభ్యత్వం తీసుకున్నారని నాయిని చెప్పారు. ఎల్బీనగర్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో లక్షమంది, కూకట్ పల్లి, మల్కాజ్ గిరి అసెంబ్లీ నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున సభ్యత్వాలు తీసుకున్నారని చెప్పారు. ఆ నియోజకవర్గాలన్నీ సెటిలర్లు ఎక్కువగా ఉన్నవేనని చెప్పారు. టీఆర్ఎస్ నగరంలోనూ బలపడుతోందని చెప్పారు. త్వరలో జరగబోయే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో తమ పార్టీ తప్పక నగర పీఠాన్ని కైవసం చేసుకుంటుందని చెప్పారు. గతంలో జరిగిన కంటోన్మెంట్ ఎన్నికల్లో అంచనాలు మించి సాధించిన ఫలితాలే మళ్లీ పునరావృత్తం అవుతాయని నాయిని జోస్యం చెప్పారు.

 

TAGS

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు