బాబుకు ప్లకార్డు చూపినందుకు.. వారిపై వేటు వేశారు!

బాబుకు ప్లకార్డు చూపినందుకు.. వారిపై వేటు వేశారు!

సాధారణంగా రాజకీయ నేతలు అన్నాకా.. వారిని అభిమానించే వారూ ఉంటారు, ఆయా నేతల నుంచి మరింత ఆదరాభిమానాలను కోరుకొంటూ నిరసన తెలిపే వారూ ఉంటారు. బహిరంగ సభల్లో తమ గురించి ప్రస్తావన తీసుకురావాలని.. తమ గురించి ఆ నేత ఆలోచించాలని చాలా మంది కోరుకొంటుంటారు. అందుకోసమంటూ... నేతల ప్రసంగాలకు అడ్డు తగులుతుంటారు. ఇవన్నీ మామూలే!

అయితే తెలుగుదేశం అధినేత చంద్రబాబు మాత్రం ఈ విషయాన్ని లైట్ తీసుకోలేకపోతున్నట్టుగా ఉన్నాడు. తన సభలో అల్లరి చేసిన వారిని ఆయన హెచ్చరిస్తూ ఉంటారు.ఆ హెచ్చరికలు అప్పటితో మరిచిపోవడం లేదు! తాజాగా నెల్లూరు జిల్లాలో జరిగిన ఒక వ్యవహారం ఆసక్తికరంగా ఉంది. ఇటీవల మహిళాదినోత్సవం సందర్భంగా చంద్రబాబు నెల్లూరులో పర్యటించారు. అక్కడ మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొంటూ సభ కూడా నిర్వహించారు.

ఈ సభలో అంగన్ వాడీ మహిళలు నిరసన స్వరం వినిపించారు. చాలా సంవత్సరాలు తమ జీతాల విషయంలో అసంతృప్తితో ఉన్న మహిళలు బాబు సభలో కూడా ఈ డిమాండ్ నువినిపించారు. ఆయన ప్రసంగానికి అడ్డుపడుతూ.. నినాదాలు చేస్తూ..ప్లకార్డులు ప్రదర్శించారు. దీంతో తెలుగుదేశాధినేతకు అప్పుడే కోపం వచ్చింది. అడ్డు తగిలిన వారిపై చర్యలు తప్పవని ఆయన స్పష్టం చేశాడు.

చివరకు అదే జరిగింది. బాబు సభలో ప్లకార్డులు ప్రదర్శించిన మొత్తం ఎనిమిది మంది అంగన్ వాడీ మహిళలపై వేటు పడింది. ఈ మేరకు జిల్లా అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు! మరి నిరసన తెలిపినందుకు ఆ మహిళల ఉపాధిపై దెబ్బ కొట్టడం న్యాయమేనా?!

 

TAGS

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు