ఆ మంత్రలు పనికి రాని వాళ్లేనా..

ఆ మంత్రలు పనికి రాని వాళ్లేనా..

సాధారణంగా రాజకీయ నాయకులంటే.. అవకాశాల కోసం గోతి కాడి నక్కలా కాచుకొని కూర్చుంటారు. అందుకే.. అధిష్ఠానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చాక మొదలుపెట్టిన తెలంగాణ సాధన సభకు హాజరయ్యేందుకు తెలంగాణ కాంగ్రెస్ నేతలు పోలోమంటూ బయలుదేరి వెళ్లారు. నిన్నమొన్నటి వరకూ తెలంగాణ గురించి పెదవి విప్పని వారు సైతం సభకు వెళ్లిన వారిలో ఉన్నారు. చిత్రంగా.. రాష్ట్రమంత్రులు దానం నాగేందర్, ముఖేష్ గౌడ్ ఇద్దరు మాత్రం సభకు వెళ్లలేదు. నగరంలో అంత భారీగా.. ప్రతిష్ఠాత్మకంగా సభ నిర్వహిస్తే.. హైదరాబాద్ కు చెందిన ఇద్దరు బడా నేతలు గైర్హాజరీ కావటం భిన్నాభిప్రాయాలకు తావిచ్చింది. తెలంగాణ సాధన సభకు తెలంగాణ మంత్రులు రాకపోవటంతో ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుపై తెలంగాణ కాంగ్రెస్ నేతలంతా ఏకాభిప్రాయంతో లేరని స్పష్టమైంది.

సభకు రాని వారి గురించి మిగిలిన వారు ఎలాంటి కామెంట్లు చేయలేదు. కాకపోతే.. విలేకరుల ప్రశ్నలతో ఇద్దరు మంత్రలు మాత్రం కారణం చెప్పాల్సి వచ్చింది. దానం నాగేందర్ అయితే ఆహ్వానం రాలేదు.. వెళ్లలేదని చెబుతూనే.. సోనియా గాంధీ వెళ్లొద్దని చెప్పిందని చెప్పుకొచ్చారు. దానం.. దానం సభకు వెళ్లద్దొని సోనియమ్మ మరేం పని లేనట్లు చెప్పటమా అని.. ఆలోచనలో పడినా.. నాగేందర్ ను నొప్పించటం ఇష్టం  లేక చాలామంది తలూపేశారు. ఇక.. మరో మంత్రి ముఖేష్ గౌడ్ అని ఇదే ప్రశ్న అడిగితే.. ఆయన మరోలా చెప్పుకొచ్చారు. ఆహ్వానం రాలేదని చెప్పిన ఆయన.. తమను పనికి రాని వాళ్లమని అనుకున్నారేమో.. అందుకే పిలవలేదని వ్యాఖ్యానించారు. మరి.. నిజంగా ఈ ఇద్దరు మంత్రలు పనికి రాని వాళ్లా? అంటే కాదనే చెప్పాలి.

సమైక్యాంధ్రను బలపర్చే వీరిని తెలంగాణ కాంగ్రెస్ నేతలు బాయ్ కాట్ చేశారట. అందుకే పిలవలేదని ఓ సీనియర్ తెలంగాణ కాంగ్రెస్ నేత వ్యాఖ్యానించారు. ‘‘ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితంగా ఉండే వారిద్దరికి తెలంగాణ ఏర్పాటుపై ఎలాంటి అభిప్రాయం ఉందో మాకు తెలుసు. చూసి.. చూసి వాళ్లను ఎందుకు పిలుస్తాం. ఒకవేళ  పిలిచినా వాళ్లు రారు. అందుకే  పిలవలేదు’’ అని మరో కాంగ్రెస్ నేత అసలు విషయం చెప్పుకొచ్చారు. ఇక్కడ ముఖేష్ మాటల్లో మరో మాటను పరిగణలోకి తీసుకోవాలి. అదేమంటే.. విభజనపై అన్ని ప్రాంతాల వారి అభిప్రాయాన్ని తెలుసుకున్న దిగ్విజయ్.. అధిష్ఠానానికి ఏం చెబుతారో అన్నది చూడాలన్నారు. అదే సమయంలో.. గ్రేటర్ హైదరాబాద్ ప్రజల మనోభావాలు దెబ్బ తీయకుండా నిర్ణయం తీసుకోవాలని తాము కోరినట్లు చెప్పారు. అంటే.. దానం.. ముఖేష్ భయ్యాలకు తెలంగాణ ఏర్పాటు ఇష్టం లేదనేగా. అందుకేనేమో.. సభను ఏర్పాటు చేసిన తెలంగాణ నేతలకు వీరిద్దరూ పనికిరాని వాళ్లు అయ్యింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు