విషెస్ చెప్పిన‌ట్లే ఇష్యూల మీద మాట్లాడుకోవ‌చ్చుగా?

విషెస్ చెప్పిన‌ట్లే ఇష్యూల మీద మాట్లాడుకోవ‌చ్చుగా?

తెలుగువారు సంతోషించే ప‌రిణామం ఒక‌టి చోటు చేసుకుంది. తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి.. ఏపీ సీఎం చంద్ర‌బాబుకు ఫోన్ చేశారు. బ‌ర్త్ డే విషెస్ చెప్పారు. ఇది ఒక విశేష‌మేనా? దీనికి కూడా సంతోషించాలా? అనుకోవ‌చ్చు.

కానీ.. విభ‌జ‌న కార‌ణంగా ఉప్పు..నిప్పులా ఉన్న రెండు రాష్ట్ర స‌ర్కారుల మ‌ధ్య తీర్చ‌లేని పంచాయితీలు ఎన్నో. నిజానికి ఎవ‌రూ విప్ప‌లేనంత పీట‌ముడులతో ఉన్నాయా? అంటే అదీ లేదు. ఇద్ద‌రు ముఖ్య‌మంత్రులు స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించాల‌న్న ఆలోచ‌న‌లో ఒక చోట కూర్చోవాలే కానీ.. రెండు తెలుగు రాష్ట్రాల మ‌ధ్య ఉన్న చాలా పంచాయితీలు గంట‌ల వ్య‌వ‌ధిలో తేలిపోవ‌టం ఖాయం.

ఆ మ‌ధ్య నాగార్జునసాగ‌ర్ డ్యాం వ‌ద్ద రెండు రాష్ట్రాల పోలీసులు గొడ‌వ ప‌డి కొట్టుకునే వ‌ర‌కూ వెళ్లిన విష‌యం.. రెండు రాష్ట్రాల్లోనూ వేడి పుట్టించింది. కానీ.. రెండు రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు కాసేపు మాట్లాడుకోగానే ఇష్యూ కాస్త సెటిల్ అయిపోయింది.

అంత పెద్ద స‌మ‌స్య కాస్త సింఫుల్ గా తేలిపోతే.. ఇప్ప‌టికి పెండింగ్ లోఉన్న స‌మ‌స్య‌లు ఎంత‌కూ ఎందుకు తేల‌వంటే.. ఎవ‌రికి వారు ఏదో ఒక‌టి చెబుతారు. తాము స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి సిద్ధంగా ఉన్నా.. అవ‌త‌లి వారు స్పందించ‌టం లేద‌ని వ్యాఖ్యానిస్తుంటారు. ఈ నేప‌థ్యంలో.. రెండు రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల్లో ఎవ‌రు చొర‌వ తీసుకుంటార‌న్న‌ది పెద్ద సందేహంగా మిగిలింది. ఆ మ‌ధ్యన రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్ రెండు రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల‌తో త‌ర‌చూ భేటీలు నిర్వ‌హిస్తాన‌ని చెప్పిన‌ప్ప‌టికీ.. అదేమీ కార్య‌రూపం దాల్చ‌లేదు.

ఇలాంటి ప‌రిస్థితుల్లో.. చంద్ర‌బాబు బ‌ర్త్‌డే సంద‌ర్భంగా తెలంగాణ ముఖ్య‌మంత్రి విషెస్‌ చెప్ప‌టం స్వాగ‌తించాల్సిన అంశమే. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల మ‌ధ్య సామ‌ర‌స్య వాతావ‌ర‌ణం ఉంటే..అది తెలుగు వారికి మేలు చేసేదే. బ‌ర్త్ డే సంద‌ర్భంగా చొర‌వ తీసుకున్న కేసీఆర్ మాదిరే.. రెండు రాష్ట్రాల మ‌ధ్య న‌లుగుతున్న వివాదాల విష‌యంలో బాబు కూడా చొర‌వ తీసుకుంటే.. తెలుగు ప్ర‌జ‌ల‌కు మేలు జ‌రిగే అవ‌కాశం ఉంది.

 

TAGS

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు