అయ్య‌న్న పాత్రుడి స్కెచ్ ఏమిటంటే..?

అయ్య‌న్న పాత్రుడి స్కెచ్ ఏమిటంటే..?

కొన్ని బ‌య‌ట‌కు చెప్పే అంశాలు ఉంటాయి. కొన్ని చెప్పాల్సిన‌వి ఉన్నా చెప్ప‌లేని ప‌రిస్థితి. ఈ రెండింటి మ‌ధ్య స‌ర‌ళ‌రేఖ‌ను చూసుకొని వ్యాఖ్య‌లు చేయాల్సిన ప‌రిస్థితి రాజ‌కీయ నేత‌ల మీద ఉంటుంది. ఏపీ మంత్రి చింత‌కాయ‌ల అయ్య‌న్న‌పాత్రుడి తీరు చూస్తుంటే.. ఆయ‌న  అలాంటివేమీ ప‌ట్టించుకునే ప‌రిస్థితుల్లో లేన‌ట్లు క‌నిపిస్తోంది.

ఇందుకు ఆయ‌న తాజాగా చేసిన వ్యాఖ్య‌లే నిద‌ర్శ‌నంగా చెప్పొచ్చు. ప‌దినెల‌ల కింద‌ట జ‌రిగిన ముచ్చ‌ట‌ను ఇప్పుడు బ‌య‌ట‌పెట్టిన ఆయ‌న‌.. సార్వ‌త్రిక ఎన్నిక‌ల స‌మ‌యంలో తాను గెలిచింది తెలుగుదేశం ఓట్ల‌తో మాత్ర‌మే కాద‌ని.. వైఎస్సార్ కాంగ్రెస్ ఓట్లు కూడా త‌న‌కు ప‌డ్డాయ‌ని వెల్ల‌డించారు. పార్టీలో త‌న‌ను కొంద‌రు దెబ్బ తీయాల‌ని చూస్తే.. తాను గుర్తించి అందుకు త‌గ్గ‌ట్లు ప‌క్కా స్కెచ్ వేయ‌టంతో విజ‌యం వ‌రించింద‌ని చెప్పుకొచ్చారు.

వైఎస్సార్ కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌ల్ని కూడా గౌర‌వించాల‌ని స్వ‌ప‌క్షం నేత‌ల‌కు చెప్పే క్ర‌మంలో అయ్య‌న్న‌పాత్ర‌డు చేసిన వ్యాఖ్య‌లు ఇక్క‌డ సంచ‌ల‌నం సృష్టిస్తున్నాయి. అయ్య‌న్న‌పాత్రుడి వ్యాఖ్య‌ల్ని చూసిన‌ప్పుడు.. స్వ‌ప‌క్షం వారు పార్టీని దెబ్బ తీసేలా వ్య‌వ‌హ‌రించార‌న్న‌ట్లు చెప్పారు. మ‌రి.. ఇలాంటి వారిపై పార్టీ అధినేత చంద్ర‌బాబు తీసుకున్న చ‌ర్య‌లేమిట‌న్న‌ది ఒక ప్ర‌శ్న‌.

ఇక‌.. అయ్య‌న్న‌పాత్రుడి స్కెచ్ చూస్తే.. ఎన్నిక‌ల‌కు మూడు రోజుల ముందు త‌న‌కు వ్య‌తిరేకంగా జ‌రుగుతున్న ప్ర‌య‌త్నాల్ని గుర్తించిన‌ట్లు వెల్ల‌డించారు. తాను వెంట‌నే త‌న స్కెచ్ మార్చుకొని.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వారితో సంప్ర‌దింపులు జ‌రిపాన‌ని.. తాను కోరిన వెంట‌నే వారు సాయం చేయ‌టానికి స్పందించార‌ని.. అలానే స‌హ‌క‌రించార‌ని వెల్ల‌డించారు.

అయ్య‌న్న‌పాత్రుడంటే డ‌క్కామొక్కిలు తిన్న మ‌నిషి కాబ‌ట్టి స‌రిపోయింది. అదే వేరే వాళ్ల సంగ‌తి ఏమిటి?  పార్టీని దెబ్బ తీసే ప్ర‌య‌త్నాలు ఎన్నిక‌ల స‌మ‌యంలో జ‌రిగింద‌న్న విష‌యం అయ్య‌న్న పాత్రుడి తాజా వ్యాఖ్య‌లు చూస్తే ఇట్టే అర్థ‌మ‌వుతుంది. ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇలాంటి విష‌యాల్లో చేయ‌గ‌లిగింది ఏమీ ఉండ‌దు. కానీ.. అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత ఇలాంటి వాటిపై చంద్ర‌బాబు ఎలా రియాక్ట్ అయ్యారు? ఆయ‌నేం చేశార‌న్న‌ది మ‌రో ప్ర‌శ్న‌. దీనికి అయ్య‌న్న‌పాత్రుడే సమాధానం చెప్పాలి. ఏది ఏమైనా పార్టీలో ప‌రిస్థితులు ఏమీ బాగోలేద‌ని.. లోప‌ల లుక‌లుక‌లు చాలానే ఉన్నాయ‌న్న విష‌యం అయ్య‌న్న‌పాత్రుడి పుణ్య‌మా అని తెలుస్తోంది. మ‌రి.. ఇలాంటి విష‌యాల‌పై చంద్ర‌బాబు ఏం చేస్తున్నారు..?

 

TAGS

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు