ఆ విషయంలో ఏక తాటిపై బీజేపీ, కాంగ్రెస్ లు!

ఆ విషయంలో ఏక తాటిపై బీజేపీ, కాంగ్రెస్ లు!

ఒకవైపు కాంగ్రెస్ యువరాజు రాహుల్ గాంధీ భారతీయ జనతా పార్టీ కార్పొరేట్లకు కొమ్ము కాస్తోందని విమర్శించాడు. భూ సమీకరణ చట్టంలో మోడీ సర్కారు తీసుకొచ్చిన సవరణలను వ్యతిరేకిస్తూ రాహుల్ ఆ విమర్శలు చేశాడు. ఇంకోవైపు భారతీయ జనతా పార్టీ నేత వెంకయ్య నాయుడు కాంగ్రెస్ పై రివర్స్ అటాక్ చేశాడు. కాంగ్రెస్ భూ సమీరణ విధానాలను ఈయన తప్పు పట్టాడు.

 కాంగ్రెస్ హయాంలో  భూ సమీకరణ పద్ధతులు సరిగా ఉండేవి కావని.. దీని వల్ల భూమిని కోల్పోయే రైతుకు తీవ్రంగా అన్యాయం జరిగిందని.. తాము న్యాయం చేయడానికే కొత్త విధానాలను తీసుకొచ్చామని వెంకయ్య అంటున్నాడు. మరి వీరిలో ఎవరి విధానాలు రైటో.. ఎవరి విధానాలు రాంగో.. సామాన్యులకు అర్థం కావడం లేదు. ఇలా మీరు కార్పొరేట్లకు అనుకూలురంటే.. కాదు మీరే కార్పొరేట్లకు అనుకూలురు అని విమర్శించుకొంటున్న ఈ రెండు పక్షాల వారూ.. మరో విషయంలో మాత్రం కార్పొరేట్లపై అపారమైన ప్రేమను కనబరుస్తున్నారు.

భూ సమీకరణ వ్యవహారంలో ఒకరిని ఒకరు నిందించుకొంటూ.. కార్పొరేట్లను చెడ్డవాళ్లుగా చూపుతున్న ఈ పార్టీల వాళ్లు.. మరోవైపు కార్పొరేట్ల నుంచి వచ్చే సొమ్ముల విషయంలో మాత్రం ఏకాభిప్రాయంతో ఉన్నారు. పార్టీలకు కార్పొరేట్లు నిధులిస్తే తప్పేంటి? అని అంటున్నారు. ఎన్నికల సంస్కరణల్లో భాగంగా.. రాజకీయ పార్టీలకు కార్పొరేట్ సంస్థలు పార్టీ ఫండ్ ను ఇవ్వడాన్ని నిరోధించాలన్న ఎన్నికల కమిషన్ తో వీరు ఏకీభవించడం లేదు! ఒక్కతాటిపై నిలబడి.. కార్పొరేట్ల నిధులు ఇవ్వడంతో తప్పులేదని.. కాంగ్రెస్ , బీజేపీలు స్పష్టం చేస్తున్నాయి. మరి ఒకవైపు కార్పొరేట్లను రైతు వ్యతిరేకులుగా చూపుతూ.. వారి నుంచి నిధుల విషయంలోమాత్రం ఏకాభిప్రాయంతో ఉన్న ఈ రాజకీయ పార్టీలను ఏమనాలి?!

 

TAGS

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు