ఇంత‌కీ ఏపీని ఏ దేశంగా మారుస్తారు బాబ?

ఇంత‌కీ ఏపీని ఏ దేశంగా మారుస్తారు బాబ?

ఏదైనా కొత్త ప్ర‌దేశాన్ని చూసి వ‌చ్చిన‌ప్పుడు కానీ.. కొంత‌కాలం గ‌డిపి వ‌స్తే.. ఆ ప్రాంతంలో తానున్న ప్రాంతాన్ని పోల్చి చూసుకోవ‌టం మామూలే. అయితే.. సాదాసీదా వ్య‌క్తి పోల్చి చూసుకోవ‌టం కార‌ణంగా ఎలాంటి మార్పు ఉండ‌దు. కానీ.. ముఖ్య‌మంత్రి స్థాయిలో ఉన్న వ్య‌క్తి కానీ ఫీలై.. త‌న ప్రాంతాన్ని కూడా అదే తీరులో బాగు చేయాల‌ని.. అభివృద్ధి ప‌ర్చాల‌ని ధృడ‌చిత్తంతో అనుకుంటే.. ఆ రాష్ట్రంలో మార్పు ఖాయం.

అయితే.. ఆ మార్పు స్థిరంగా ఉండాలే కానీ.. చిన్న‌పిల్లాడి మాదిరి ఉండకూడ‌దు. కానీ.. ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు తీరే కాస్త భిన్నంగా ఉంది. తొలిసారి విదేశాల‌కు వెళ్లి వ‌చ్చిన త‌ర్వాత‌.. తాను చూసిన వాటి గురించి గొప్ప‌లు చెప్పుకోవ‌టం మామూలే. ప్ర‌స్తుతం చంద్ర‌బాబు మాట‌లు ఇందుకు భిన్నంగా ఏమీ లేవు.

విభ‌జ‌న నేప‌థ్యంలో.. ఏపీకి ఒక రాజ‌ధాని న‌గ‌రాన్ని ఏర్పాటు చేయాల్సిన అవ‌స‌రం ఏర్ప‌డింది. అదే స‌మ‌యంలో పెద్ద ఎత్తున పెట్టుబ‌డులు తీసుకొచ్చి.. అభివృద్ధి చేయాల్సిన అవ‌స‌రం ఉంది. ఇందుకోసం ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ‌స్వీకారం చేసిన త‌ర్వాత‌.. సింగ‌పూర్‌.. జ‌పాన్ దేశాల్లో ప‌ర్య‌టించిన త‌ర్వాత‌.. తాజాగా చైనా వెళ్లి రావ‌టం తెలిసిందే.

ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమిటంటే.. తాను ఏ దేశానికి వెళితే.. తిరిగి వ‌చ్చిన త‌ర్వాత ఆ దేశం గురించి గొప్ప‌లు చెప్పుకోవ‌టం క‌నిపిస్తుంది. అంత‌వ‌ర‌కూ ఓకే కానీ.. ఈ మ‌ధ్య‌న చంద్ర‌బాబులో క‌నిపిస్తున్న ల‌క్ష‌ణం ఏమిటంటే.. తాను ఏ దేశానికి వెళ్లి వ‌స్తే.. అక్క‌డున్న‌వ‌ని ఏపీలో కూడా తీసుకొస్తాన‌ని చెప్ప‌ట‌మే కాదు.. సింపుల్‌గా.. ఏపీని చైనాగా చే్స్తా.. ఏపీని సింగ‌పూర్‌ను త‌ల‌పించేలా రూపొందిస్తా లాంటి సినిమా డైలాగులు చెప్పే ధోర‌ణి ఎక్కువైంది.

నిజంగా.. ఏపీని మ‌రో దేశంలా చేయ‌టం సాధ్య‌మేనా? అక్క‌డి ప‌రిస్థితులు.. ఇక్క‌డి ప‌రిస్థితులకు పోలిక ఉందా? అక్క‌డి క్ర‌మ‌శిక్ష‌ణ‌.. వ‌ర్క్ క‌ల్చ‌ర్‌.. అవినీతి లాంటి వాటిల్లో మ‌న‌కూ.. వారికి అస‌లు సంబంధం ఉంటుందా? ఇలా మొద‌లుపెడితే.. ఏ దేశంతోనూ మ‌న‌ల్ని పోల్చుకోలేని ప‌రిస్థితి. మ‌న‌దైన కోణంలో ఆలోచించి.. మ‌న‌కు త‌గ్గ‌ట్లుగా మ‌న ప‌రిస‌రాల్ని మార్చుకోవాలి.. అభివృద్ధి దిశ‌గా అడుగులు వేయాలే త‌ప్పించి.. వెళ్లి వ‌చ్చిన దేశాలుగా ఏపీని మార్చ‌టానికి.. ఆంధ్ర్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రమేమీ చిన్న బొమ్మ కాదు.

మంచిని చూసిన‌ప్పుడు.. వాటిని అనుస‌రించాల‌ని.. వాటిని పాటించాల‌ని..వీలైతే.. అలాంటివి మ‌న ద‌గ్గ‌ర కూడా పెట్టుకోవాల‌ని భావించ‌టంలో త‌ప్పు లేదు. అలా అని చిన్న పిల్లాడి మాదిరిగా ఆలోచ‌న కూడా స‌రికాదు. ముఖ్య‌మంత్రి స్థానంలో ఉన్న వ్య‌క్తి.. ఏపీని ఏం చేయాల‌న్న దానిపై ఒక విజ‌న్‌తో మాట్లాడాలేకానీ.. వెళ్లిన ప్ర‌తి దేశంలా ఏపీని మారుస్తాన‌ని చెప్ప‌టం ఏ మాత్రం మంచిది కాదు. మ‌రి.. ఆ విష‌యాన్ని బాబు అర్థం చేసుకుంటారా..?

 

TAGS

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు