వైఎస్ కాంట్రాక్ట‌ర్ కే ప‌ట్టిసీమ కాంట్రాక్టు

వైఎస్ కాంట్రాక్ట‌ర్ కే ప‌ట్టిసీమ కాంట్రాక్టు

ప‌ట్టిసీమ ప్రాజెక్టును ఏ క్ష‌ణంలో నిర్ణ‌యం తీసుకున్నారో కానీ.. ఆ ప్రాజెక్టు మీద విమ‌ర్శ‌ల‌కు అంతూపొంతూ లేకుండా పోతోంది. ఈ ప్రాజెక్టు పుణ్య‌మా అని ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడికి రూ.300కోట్ల ముడుపులు అందినట్లు ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్నారు. ఈ ప్రాజెక్టును వ్య‌తిరేకిస్తూ.. ఏపీ విపక్ష నేత వైఎస్ జ‌గ‌న్ అయితే.. ఏకంగా బ‌స్సు యాత్ర‌నే స్టార్ట్ చేశారు.

ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఒక ఆస‌క్తిక‌ర‌మైన అంశం ఉంది. ఈ ప్రాజెక్టును తీవ్రంగా విమ‌ర్శిస్తూ.. విప‌రీతంగా ఆరోప‌ణ‌లు చేస్తున్న జ‌గ‌న్ తండ్రి దివంగ‌త వైఎస్ హ‌యాంలో చేప‌ట్టిన ప‌లు ప్రాజెక్టుల‌కు కాంట్రాక్ట‌ర్ గా వ్య‌వ‌హ‌రించిన వారికే ప‌ట్టిసీమ ప్రాజెక్టు కాంట్రాక్టు ఇవ్వ‌టం విశేషం. ఈ విష‌యంపై ఇప్ప‌టివ‌రకూ మాట్లాడ‌ని ఏపీ అధికార‌ప‌క్ష నేత‌లు తాజాగా గొంతు విప్పారు.
వైఎస్ హ‌యాంలో ప‌లు ప్రాజెక్టు కాంట్రాక్టులు చేసిన వ్య‌క్తికే ప‌ట్టిసీమ ప్రాజెక్టు ఇచ్చార‌ని.. అలాంట‌ప్పుడు అవినీతి ఆరోప‌ణ‌లు చేస్తున్న జ‌గ‌న్‌.. ఆ కాంట్రాక్ట‌ర్ అవినీతికి పాల్ప‌డిన‌ట్లా? అని ప్ర‌శ్నిస్తున్నారు ఏపీ ఎంపీ కేశినేని నాని.

వైఎస్ హ‌యాంలో చ‌క్రం తిప్పిన కాంట్రాక్ట‌ర్‌కు ప్ర‌తిష్ఠాత్మ‌క‌మైన ప‌ట్టిసీమ ప్రాజెక్టు ఇవ్వ‌టంపై అప్ప‌ట్లో తెలుగు త‌మ్ముళ్ల‌లో అసంతృప్తి వ్య‌క్త‌మైంది. త‌మ‌లో ఇంత‌మంది ఉంటే.. వారిని వ‌దిలేసి.. వైఎస్ హ‌యాంలో ప్రాజెక్టులు చేప‌ట్టిన కాంట్రాక్ట‌ర్‌కు అప్ప‌జెప్ప‌టం ఏమిటంటూ లోగుట్టుగా విమ‌ర్శించుకునేవారు.

తాజాగా.. ఇప్పుడు అదే అంశాన్ని ఆయుధంగా చేసుకొని కేశినేని నాని విమ‌ర్శ‌లు చేస్తున్నారు. ల‌క్ష కోట్ల రూపాయిలు తిని జైలుకు వెళ్లిన జ‌గ‌న్ లాంటి వ్య‌క్తి అవినీతి గురించి మాట్లాడే హ‌క్కు లేద‌ని నాని వ్యాఖ్యానిస్తున్నారు. ఇక్క‌డ‌.. ఆస‌క్తిక‌ర‌మైన అంశాలు రెండున్నాయి. ఒక‌టి.. వైఎస్ హ‌యాంలో కాంట్రాక్ట‌ర్ల నుంచి జ‌గ‌న్ డ‌బ్బులు తీసుకునే వార‌ని తెలుగుదేశం నేత‌లు వ్యాఖ్యానించే వారు. మ‌రి.. అలాంటి కాంట్రాక్ట‌ర్ల‌లో ఒకరికి.. ప‌ట్టిసీమ ప్రాజెక్టు  ఇవ్వ‌టంలో మ‌ర్మ‌మేమిటి? ఒక‌వేళ ప‌ట్టిసీమ ప్రాజెక్టు కాంట్రాక్ట‌ర్ సుద్ద‌పూస అయితే.. వైఎస్ హ‌యాంలో ఆయ‌న చేప‌ట్టిన ప్రాజెక్టుల‌కు కూడా పైసా ఇవ్వ‌న‌ట్లే క‌దా? మ‌రి.. కేశినేని నాని ఎవ‌రికి క్లీన్ చిట్ ఇద్దామ‌నుకుంటున్నారు..?

 

TAGS

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు