ఆ మంత్రులు ఎందుకు రారు...

ఆ మంత్రులు ఎందుకు రారు...

తెలంగాణ సాధన సభకు తెలంగాణ కాంగ్రెస్ నేతలు పోలోమంటూ క్యూ కట్టారు. ఎప్పుడూ తెలంగాణ అంశాన్ని బహిరంగంగా మాట్లాడని డీఎస్ లాంటి వాళ్లు సైతం వచ్చారు. కానీ.. రాష్ట్ర మంత్రులు దానం నాగేందర్, ముఖేష్ గౌడ్ లాంటి వాళ్లు రాలేదు. ఇక.. కేంద్రమంత్రి.. తెలంగాణ విషయంలో మొదటి నుంచి వెనుక ఉండి నడిపించే జైపాల్ రెడ్డి కూడా రాలేదు. జైపాల్ రాకపోవటానికి.. రాష్ట్రమంత్రులు హాజరు కాకపోవటానికి కారణాలు వేర్వేరుగా ఉన్నాయని చెప్పకతప్పదు. అధిష్ఠానానికి అత్యంత సన్నిహితుడిగా ఉండే జైపాల్ రెడ్డి  సభకు రావటం అంటే.. తెలంగాణ ప్రకటన తరువాయే అన్నట్లు. ప్రస్తుతానికి తెలంగాణ అంశం కీలకదశకు చేరుకొని.. తుది దశకు రెండు అడుగుల దూరంలో ఉంది. ఊహించని పరిణామాలు ఏమైనా చోటు చేసుకునే పక్షంలో కాంగ్రెస్ అధినాయకత్వం ఈ విషయంలో పునరాలోచనలో పడే అవకాశం లేకపోలేదు. అందుకే.. అనవసరంగా సభకు వచ్చి అంచనాలు పెంచే కన్నా... దూరంగా ఉండటమే మేలన్నది జైపాల్ అభిమతంగా చెబుతారు.

ఇక.. రాష్ట్ర మంత్రుల వైఖరి అందుకు పూర్తి భిన్నమైంది. దానం, ముఖేష్ మొదటి నుంచి తెలంగాణకు అనుకూలంగా లేరు. నగరంలోనే పుట్టి పెరగడం వల్లో, తెలంగాణ ఏర్పాటు వల్ల పెద్ద తేడా ఏమీ రాదన్న కారణమో, లేక సమైక్యం వల్లే హైదరాబాదు బాగుంటుంది, ఇది బాగుంటే మేమూ బాగుంటాం... అనుకోవడం వల్ల వారు సమైక్యానికే మొగ్గు చూపుతారు. అందుకే తెలంగాణపై వారి వైఖరి మొదటి నుంచి వేరుగా ఉంది. అలాంటి వ్యక్తులు ఇప్పుడు సభకు రావటం అంటే.. వారు అభిమానించే క్యాడర్ కు, వారికి ఇబ్బందికరమే. దానికి తోడు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి సన్నిహితులుగా పేరొందిన వారు.. తమ నేత అభిమతానికి వ్యతిరేకంగా పని చేయటం సుతారమూ ఇష్టం ఉండదు. రాష్ట్రాన్ని కలిపి ఉంచేందుకు విపరీతంగా శ్రమిస్తున్న కిరణ్ కుమార్ రెడ్డికి అండగా నిలిచేందుకే.. దానం, ముఖేష్ లు సభకు దూరంగా ఉన్నారని చెప్పొచ్చు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు