వారి బంధమే వేరు..

వారి బంధమే వేరు..

కనిమొళి గుర్తుందా. పేరు ఎక్కడో విన్నట్లు ఉందా? అదేనండి తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి అమ్మాయి. కాస్త గుర్తుకు వచ్చింది. ఫర్లేదు.. మిగితా కాస్త మేం గుర్తు చేస్తాం. 2జీ స్కాంలో ఆమె పాత్ర ఉందని లోకం కోడై కూయటంతో ఆమెను అరెస్ట్ చేసి..జైల్లో కొంత కాలం ఉంచారు. తర్వాత బెయిల్ మీద విడుదలయ్యారు. అంతేనా.. వాళ్ల  పార్టీకే చెందిన రాజా (మాజీ కేంద్రమంత్రి) ను డీఎంకేలో ఆ స్థాయికి తెచ్చిన నేత ఎదగటానికి ఆమె ఎంతో సాయం చేసేదని తమిళ ప్రజలు చెబుతుంటారు. ఇవే కాకుండా కవితలు రాయటం.. ఆమె ప్రతిభను పేజీల కొద్దీ తెలుగుపేపర్లలో కూడా పొగిడేశారు.. గుర్తుకు వచ్చిందా? అ... కనిమొళి గురించే ఇప్పుడు మాట్లాడుకుంటుంది. ఇప్పుడేమైందంటారు. ఏముంది? ఆమె మళ్లీ ఎంపీ అయ్యారు. విశేషమే కదా. ఎన్నికలు ఎప్పుడు జరిగాయి అంటారా? రాజ్యసభలో ఖాళీ అయిన సీట్లకు జరిగిన ఎన్నికల్లో ఆమె పోటీ చేసి మరీ గెలిచారు.

విశేషమేమంటే.. 2జీ స్కాంలో ఆరోపణలు వచ్చినప్పుడు.. తన కుమార్తె అని కూడా చూడకుండా యూపీఏ సర్కారు(అదేనండి.. సోనియా, మన్మోహన్ తదితరులతో కూడిన కూటమి) జైలు పాలు చేసిందని పెద్దాయన కరుణానిధి చాలా ఫీలయ్యారు. కూతురు పరిస్థితి చూసుకొని కన్నీళ్లు కూడా పెట్టుకున్నారు. ఆయన ఆ రోజు పడిన వేదన సోనియమ్మను కదిలించి ఉంటుంది. తమ ప్రభుత్వానికి  ఎంతో స్నేహంగా ఉన్నా కూడా.. వాళ్ల  అమ్మాయిని జైలుపాలు  కావటం ఆమె మనసును కదిలించి ఉంటుంది. అందుకే స్నేహధర్మం పాటించారు. రాజ్యసభ ఎంపీగా గెలుపొందటానికి అవసరమైన ఓట్లు (ఎంపీ, ఎమ్మెల్యేలతో కూడిన) కరుణానిధి దగ్గర లేవు. దీంతో కనిమొళి గెలుపునకు అవసరమైన ఓట్లను కాంగ్రెస్ వేసి చివరికి ఎంపీని చేశారు. ఎంతో శ్రమ తీసుకొని తనను ఎంపీగా ఎన్నికయ్యేందుకు సాయం చేసిన సోనియాను కనిమొళి కలిసి.. థ్యాంక్స్ చెప్పారు.

 అదేంటి... మూడురోజులు మన ముఖ్యమంత్రి ఢిల్లీలోకూర్చొని సోనియాను కలుద్దామనుకున్నా.. ఆమె అపాయింట్ మెంట్ ఇవ్వలేదు.. ఇలా ఎన్నికైన ఎంపీ అలా వెళ్లి  ఎలా కలుస్తారన్న ధర్మసందేహాలను వదిలేయండి. ముఖ్యమంత్రి అయినా..ప్రధానమంత్రి అయినా.. ఢిల్లీలో సోనియమ్మ లెక్కలే వేరు. ఆమె ఊ అంటే కార్పొరేటర్ అయినా వెళ్లి కలవగలరు. ఉహు.. అనుకున్నారా.. మొన్న మన ముఖ్యమంత్రికి జరిగినట్లే అవుతుంది. నేరచరిత ఉన్నవాళ్లను చట్టం శిక్షిస్తుంది. వాళ్లను ప్రభుత్వం నుంచి దూరంగా పెడతాం. ఇలాంటి సొల్లు కబుర్లు కాంగ్రెస్ వాళ్లు చాలానే చెబుతారు. మరి.. నేరచరిత ఆరోపణలు ఉండి.. జైల్లో కొంతకాలం గడిపిన (ఎలాంటి ఆధారాలు లేకపోతే ఎంపీ స్థాయి వ్యక్తికి అంత గడ్డు పరిస్థితి రాదు కదా) వాళ్లను మళ్లీ ఎంపీ చేయటానికి నీతి సూత్రాలు నిత్యం వల్లించే సోనియా సైతం సరేనని.. ఓట్లు వేసి మరి ఎందుకు గెలిపించారు? అంటే చెప్పే మాటలకు.. చేసే పనులకు అస్సలు సంబంధం ఉండదా? ఎంతైనా.. రాజకీయనేతల మధ్య బంధమే వేరు. కావాలంటే కౌగిలించుకోగలరు. వద్దనుకుంటే.. విసిరిపారేయగలరు. సోనియా.. కనిమొళి అందుకు భిన్నమేమీ కాదుగా.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు