హైదరాబాద్‌లో ఆసుపత్రుల్ని కట్టద్దన్నారు

హైదరాబాద్‌లో ఆసుపత్రుల్ని కట్టద్దన్నారు

తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్‌ నరసింహన్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆచితూచి మాట్లాడుతూ.. ఎక్కడా తన మాటలు చర్చ రేకేత్తేలా వ్యవహరించని ఆయన.. తాజాగా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశాలుగా మారాయనే చెప్పాలి.

ఇకపై.. హైదరాబాద్‌లో ఆసుపత్రులు కట్టద్దంటూ ఆయన స్పష్టమైన వ్యాఖ్యలు చేశారు. ఆసుపత్రులు నిర్మించాలని భావించేవారు.. ఆయా రాష్ట్రాల్లోని జిల్లాల్లో నిర్మించుకోవాలని సూచన చేశారు. అదే సమయంలో ప్రైవేటు ఆసుపత్రులు వ్యవహరిస్తున్న తీరుపైనా ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయటమేకాదు.. వైద్యం కోసం వేస్తున్న బిల్లుల్ని చూస్తుంటేనే సగం ప్రాణం పోతుందంటూ ఆయన మండిపడ్డారు.

ఒక వైద్య సేవను అందించేందుకు ఒక్కో ఆసుపత్రిలో ఒక్కో మాదిరి వసూలు చేయటం ఏమిటని ప్రశ్నించిన ఆయన.. ఈ వ్యవహరంపై ఇరు రాష్ట్రాల ఆరోగ్య మంత్రులు అత్యవసరంగా సమావేశమై. తీసుకోవాల్సిన చర్యలపై చర్చించాలని కోరారు.

ఒక గవర్నర్‌ వ్యవహారశైలికి భిన్నంగా నరసింహన్‌ వ్యాఖ్యలు చేసినప్పటికీ.. ప్రజల నుంచి మాత్రం ఆయన వ్యాఖ్యలపై సానుకూలత వ్యక్తమవుతోంది. నిత్యం ప్రజలు అనుభవించే మానసిక వేదననే గవర్నర్‌ ప్రస్తావించారని.. గవర్నర్‌గా నరసింహన్‌ లాంటి వారు సరిగ్గా సరిపోతారన్న వాదనలు వినిపిస్తున్నాయి. మరి.. ప్రైవేటు ఆసుపత్రులపై నరసింహావతారంపై ఇరు రాష్ట్ర సర్కారులు ఎలా రియాక్ట్‌ అవుతాయో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు