పెట్రోల్‌ లీటరుకు రూ.10 తగ్గేనా..?

పెట్రోల్‌ లీటరుకు రూ.10 తగ్గేనా..?

పెట్రోలు ధర తగ్గింపుపై మళ్లీ అంచనాలు మొదలయ్యాయి. ఇప్పటికే పెట్రోల్‌ ధరల తగ్గింపుపై.. అదంతా మోడీ సర్కారు మహత్యమేనని.. అధికార పార్టీ జాతీయ అధ్యక్షుడు సైతం ప్రచారంతో ఉదరకొడుతున్న సంగతి తెలిసిందే.

అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితుల కారణంగా..  ప్రతినెలా పెట్రోల్‌.. డీజిల్‌ ధరలు  కాస్త అటూఇటూగా తగ్గిస్తున్న సంగతి తెలిసిందే. అయితే.. అంతర్జాతీయంగా పడిపోయిన క్రూడ్‌ ఆయిల్‌ ధరలతో పోలిస్తే. పెట్రోల్‌ డీజిల్‌పై సర్కారు తగ్గించింది చాలా స్వల్పమేనని చెప్పాలి. గత సంవత్సరం జూన్‌లో బ్యారెల్‌ ముడిచమురు 115 డాలర్ల ధర పలకగా.. ఇప్పుడు అది కాస్తా 45 డాలర్లకు పడిపోయింది.

వ్యాపారుల అంచనాల ప్రకారం.. బ్యారెల్‌ ముడిచమురు ధర 30 డాలర్లకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు. ముడిచమురు ధరలో 60 నుంచి 70శాతం మార్పు వస్తే.. పెట్రోల్‌ ధర తగ్గింపు విషయంలో మాత్రం అంత మార్పులు చోటు చేసుకోలేదనే చెప్పాలి.

నిబంధనల ప్రకారం చమురు సంస్థలు ప్రతి నెలా 15వ తేదీన.. నెలాఖరు రోజున అంతర్జాతీయంగా ముడిచమురు ధరలను అనుసరించి.. దానికి తగ్గట్లుగా ధరల్ని నిర్ణయించటం తెలిసిందే. తాజాగా యాభై డాలర్లకు దిగువన బ్యారెల్‌ ముడిచమురు పడిపోయిన నేపథ్యంలో.. పెట్రోల్‌ ధరను ఎంతమేరకు తగ్గిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.

వ్యాపార వర్గాల ప్రకారం.. పెట్రోల్‌ ధర లీటరకు రూ.10 తగ్గించొచ్చని అంచనా వేస్తున్నారు. అయితే.. పారిశ్రామిక వర్గాలు మాత్రం లీటరుకు పదిరూపాయిలు తగ్గించటం ఎంతమాత్రం సాధ్యం కాదని చెబుతున్నారు.

పెట్రోల్‌.. డీజిల్‌పై సర్కారు భారీగా పన్నులు వసూలు చేస్తున్న నేపథ్యంలో ఒక్కసారిగా లీటరుగా పదిరూపాయిల మేర ధర తగ్గిస్తే కేంద్ర.. రాష్ట్ర ఖజానాల మీద తీవ్ర ప్రభావం పడుతుందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో.. అరకొరగానే ధరను తగ్గించే అవకాశం ఉందన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి. ధర పెరిగినప్పుడు భారం మోసేందుకు ఏమాత్రం సిద్ధంగా ఉండని ప్రభుత్వాలు.. ధర తగ్గినప్పుడు మాత్రంఆ ఫలాల్ని ప్రజలకు బదిలీ చేయటానికి సైతం సిద్ధంగా లేకపోవటం.. దేశప్రజలు చేసుకున్న దురదృష్టమా..?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు