ఏపీకి కేసీఆర్‌ లాంటి నేత ఉంటే..?

ఏపీకి కేసీఆర్‌ లాంటి నేత ఉంటే..?

చాలా సందర్భాల్లో సగటు సీమాంధ్రుడి మనసులోకి వచ్చే ఆలోచన ఇది. ఆంధ్రప్రదేశ్‌కు.. తెలంగాణకు మధ్య వ్యత్యాసం ఏమిటంటే.. తమ ప్రాంత  ప్రయోజనాల్ని బలంగా వినిపిస్తూ.. సరికొత్త లాజిక్‌తో అవతలి వారి నోటి నుంచి మాట రాకుండా ఉండేలా చేయటంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ ట్రాక్‌రికార్డును ఎవరూ బ్రేక్‌ చేయలేరనే చెప్పాలి.

తెలంగాణ రాష్ట్ర ఉద్యమం సమయంలోనూ.. ఏపీ కారణంగా తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని ఏకరువు పెడుతుంటే.. దానికి ధీటైన వాదనను వినిపించటంలో ఏపీ నేతలు అడ్డంగా ఫెయిల్‌ అయ్యారనే చెప్పాలి. ప్రపంచంలో ఏ జాతికి రానటువంటి చెడ్డపేరును సీమాంధ్రులకు అంటగట్టటంలో కేసీఆర్‌ విజయవంతం అయ్యారనే చెప్పాలి.

ఈ కారణంతోనే.. కేసీఆర్‌ తన జీవితకాల లక్ష్యాన్ని చేరుకోగలిగారని చెప్పాలి. అదే కేసీఆర్‌లాంటి వ్యక్తి ఏపీలో ఉన్నట్లయితే.. పరిస్థితి మరోలా ఉండేదనటంలో ఎలాంటి సందేహం లేదు. తాజాగా కోడి పందాల విషయంలోనూ సీమాంధ్రులు తెలంగాణ సీఎం కేసీఆర్‌ను గుర్తు చేసుకుంటున్నారు.

కేసీఆర్‌ లాంటి వ్యక్తి తమ ప్రాంతానికి చెందిన నేతగా ఉండి ఉంటే.. కోడిపందాలు దాని చరిత్ర.. అసలు వాటిని ఎప్పుడు ఎలా మొదలుపెట్టారు? అదెంత గొప్ప సంస్కృతి.. ఎంత గొప్ప సంప్రదాయం.. అసలు ఒక ప్రభుత్వంగా ఏం చేయాలి? వాటిని విమర్శించే వారి పరిస్థితేంది? ఇలాంటి ఎన్నో అంశాల్ని ప్రస్తావించటమే కాదు.. లాజికల్‌ ఆర్గ్యూమెంట్‌ చేయటం ద్వారా.. ఎవరూ తిరిగి సమాధానం చెప్పలేని విధంగా ఆయన తన వాదనను సిద్ధం చేసుకుంటారు.

దురదృష్టవశాత్తు కేసీఆర్‌ లాంటి నేత ఏపీలో లేకపోవటంతో.. కోడిపందాలకు సంబంధించిన చరిత్ర.. దాని ప్రత్యేకత.. ఏపీ ప్రజలు ఎంతలా దానికి అలవాటు పడ్డారన్న విషయాలతో పాటు.. కోడి పందాల్ని నిర్వహించటంలో ప్రభుత్వంగా చేయాల్సినవి లాంటి ఎన్నో అంశాల్ని తనదైన శైలిలో చెప్పుకొచ్చేవారన్నఅభిప్రాయం వ్యక్తమవుతోంది. కోడిపందాలు కావాలని లక్షలాది మంది జనం కోరుకుంటుంటే.. నేతలెవరూ ప్రజల గొంతును బలంగా.. సమర్థంగా వినిపించలేకపోతున్నారన్న ఆందోళన వ్యక్తమవుతోంది. అయినా.. సీమాంధ్రులు కేసీఆర్‌ను అభిమానించటం ఏమిటి..?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు