సేకరణకు సమయం సరిపోతుందా?

సేకరణకు సమయం సరిపోతుందా?

ఏపీ ప్రతిపాదిత రాజధానిలో భూసేకరణకు సంబంధించి ఏపీ అధికారపక్షం పెట్టుకున్న లక్ష్యంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మొదట 30వేల ఎకరాల భూమిని కేవలం 30 రోజుల వ్యవధిలో పూర్తి చేయాలన్న లక్ష్యం పెట్టుకున్నారు.

ఇందుకోసం 29 గ్రామాల్లో 13 బృందాలకు బాధ్యతలు అప్పజెప్పారు. లెక్కడా చెప్పాలంటే రోజుకు వెయ్యి ఎకరాల చొప్పున భూసేకరణను చేయాల్సి ఉంటుంది. రాజధాని నిర్మాణానికి సంబంధించి భూసేకరణ చాలా కీలకమైన ప్రక్రియ. ఆ విషయంలో ఏ చిన్న తప్పు దొర్లినా.. ఆలస్యం చోటు చేసుకున్నా చాలా ఇబ్బందులు ఎదుర్కొవాల్సి ఉంటుంది.

అందుకే.. దీర్ఘకాలిక లక్ష్యంగా కాకుండా స్వల్పకాలిక లక్ష్యంగా పెట్టుకొని కేవలం నెల రోజుల్లోనే మొత్తం భూసేకరణను ముగించాలని భావిస్తున్నారు. కానీ.. వాస్తవ పరిస్థితుల్ని పరిగణలోకి తీసుకొని చూస్తే అనుకున్న గడువు లోపు 30వేల ఎకరాల భూమిని సేకరించటం కష్టమేనన్న భావన వ్యక్తమవుతోంది. మొదటి ఆరు రోజుల్లో సేకరించిన భూమిని చూస్తే కేవలం 3వేల ఎకరాలు మాత్రమే. జనవరి 12 నాటికి ఇది కేవలం 3,900 ఎకరాలు మాత్రమే.

అంతే.. దాదాపు పది రోజులకు ఏపీ అధికారులు సేకరించిన భూమి 3900 ఎకరాలంటే. రోజుకు సరాసరిన 390 ఎకరాలు మాత్రమే సేకరించినట్లు. ఈ లెక్కన 30 వేల ఎకరాల సేకరణ మరెన్ని రోజులు తీసుకుంటుందో అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

సాధారణంగా భూసేకరణ లాంటి ప్రక్రియ మొదలుపెట్టినప్పుడు ప్రభుత్వానికి సానుకూలంగా గ్రామాల నుంచి మొదలు పెడతారు. అలాంటి చోటే మొదటి ఆరు రోజుల్లో కేవలం 3వేల ఎకరాలు మాత్రమే సేకరించటం చూసినప్పుడు.. రానున్న రోజుల్లో భూసేకరణ మరింత కష్టమవుతుందన్న భావన కలుగుతోంది.

దీనికితోడు పండుగ సెలవులతో పాటు.. ప్రాక్టికల్‌గా ఉన్న సమస్యల్ని పరిగణలోకి తీసుకుంటే.. నెల రోజుల వ్యవధిలో భూసేకరణ లక్ష్యం పూర్తి కావటం కష్టమనే అభిప్రాయాన్ని పలువురు వ్యక్త చేస్తున్నారు.

 

TAGS

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు