సారు సర్కారుకు అదిరిపోవటం ఖాయం

సారు సర్కారుకు అదిరిపోవటం ఖాయం

తెలంగాణ.. తెలంగాణ అనే తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు తమ వరకు వచ్చేసరికి మాత్రం వెనక్కి తగ్గటం లేదు. తెలంగాణ కోసం ఎంతకైనా రాజీపడటం.. త్యాగం చేస్తామని మాటలు చెప్పిన వారంతా ఇప్పుడు.. తమ జీతభత్యాల పెంపు కోసం చేస్తున్న కసరత్తు చూసినోళ్లంతా షాక్‌ తింటున్నారు.

తెలంగాణ తొలి వేతన సవరణగా పేర్కొంటూ..ఆరంభం అదిరిపోయేలా గ్రాండ్‌గా పీఆర్సీ ఉండాలని కోరుతున్నారు. ఇందుకోసం.. ఏకంగా 69 శాతం ఫిట్‌మెంట్‌ ఉండేలా వారు నిర్ణయం తీసుకున్నారు. తాము కోరిన ఈ చిన్న కోరికను తెలగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆమోదించాలని కోరుతున్నారు. తెలంగాణ ఉద్యోగ సంఘాల ఐకాస కలిసి.. తెలంగాణ ప్రభుత్వ వేతన సవరణపై నిర్ణయాలు తీసుకున్నారు.

తాజాగా.. ఉద్యోగులు ప్రతిపాదిస్తున్న వేతన సవరణ చూసి గడ్లు తేలేసే పరిస్థితి. ఉద్యోగులు కోరినట్లుగా 69శాతం ఫిట్‌మెంట్‌ను కానీ తెలంగాణ ప్రభుత్వం ఆమోదిస్తే.. రాష్ట్ర ఖజానా మీద విపరీతమైన భారం పెరుగుతుంది. దీనికి తోడు.. కొత్త పోస్టులను జారీ చేయాలన్న డిమాండ్‌ ఉండనే ఉంది.

కొత్త ఉద్యోగాలకు ప్రకటన ఇచ్చి.. ఇప్పుడున్న ఉద్యోగులు కోరుకున్న పీఆర్సీ ప్రకటిస్తే.. తెలంగాణ రాష్ట్ర బడ్జెట్‌ భారీగా ప్రభావితం కావటం ఖాయమని చెబుతున్నారు. ఉద్యోగ సంఘాల వారు కోరుకున్న రీతిలో తెలంగాణ రాష్ట్ర సర్కారు ఓకే అంటే.. ఇప్పుడున్న ఖర్చుకు అదనంగా రూ.6900కోట్లు భారం పడే అవకాశం ఉంది. ఇదంతా కూడా పన్నుల రూపంలో ముక్కుపిండి ప్రజల దగ్గర నుంచే వసూలుచేయాల్సి ఉంటుంది. అంతేకాదు.. కేవలం జీతాలు.. పింఛన్ల కోసం తెలంగాణ సర్కారు 34వేల కోట్ల రూపాయిల ఖర్చుకు సిద్ధం కావాల్సి ఉంటుంది. అదిరిపోయే పీఆర్సీతో తెలంగాణ సర్కారు అదరగొట్టాలని అడుగుతున్న తీరును చూసిన ఒక కీలక నేత వ్యాఖ్యానిస్తూ.. ''వారు కోరుకున్నంత ఇస్తే ప్రభుత్వానికి ఆదిరిపోవటం ఖాయం. మరి.. మా సారు ఎలా స్పందిస్తారో చూడాలి'' అంటూ వ్యాఖ్యానించారు. ప్రభుత్వంపై విపరీతమైన భారాన్ని మోపేలా తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు తీసుకున్న నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

 

TAGS

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు