పేదోళ్లు ఏం అడిగినా సారుకు కోపం రాదే..!

పేదోళ్లు ఏం అడిగినా సారుకు కోపం రాదే..!

పేదోడు ఏం అడిగినా ఫర్లేదు. మధ్యతరగతి.. ఎగువ మధ్యతరగతి వారు ఏం అడిగినా సిరాకు పడిపోవటమే కాదు.. కేసులు పెట్టిస్తామని భయపెడతారా? ఇదెక్కడ న్యాయం అని ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యవహారశైలిపై కొందరు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మిగిలిన విషయాల సంగతి ఎలా ఉన్నా.. తమ ఇష్టాఇష్టాల విషయంలో కేసీఆర్‌ వ్యవహరిస్తున్న వివక్షపై పేకాటరాయుళ్లు మండిపడుతున్నారు.

ఒకరికి ఒక న్యాయం.. మరొకరికి మరోలా న్యాయం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఈ మధ్యన వరంగల్‌ జిల్లాలో నాలుగురోజుల పాటు ఉన్న కేసీఆర్‌.. పలు కాలనీలకు వెళ్లటం తెలిసిందే. ఈ సందర్భంగా అక్కడి మహిళలు.. ప్రభుత్వం సారాయి సరఫరా చేయాలని అభ్యర్థించారు. దీనికి కేసీఆర్‌ సైతం కాస్తంత సానుకూలంగా రియాక్ట్‌ అయ్యారు కూడా. పేదలు గుడుంబాకు అలవాటు పడుతున్నారని.. దీని బదులు ఎన్టీఆర్‌ కాలంలో మాదిరి ప్రభుత్వమే తక్కువ ధరకు అందించే సారాయిని తీసుకురావాలన్న దానిపై దృష్టి పెట్టినట్లు చెబుతున్నారు.

ఇక్కడే పేకాట రాయుళ్లు మండిపడుతున్నారు. పేదోళ్లు సారాయిని సర్కారు సరఫరా చేయాలని అడిగితే ఏమీ అనరని.. కానీ తాము పేకాట ఆడుకునేందుకు కాస్తంత వెసులుబాటు ఇవ్వమంటే మాత్రం కస్సుమని లేస్తున్నారంటూ అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సారాయితో పోలిస్తే.. పేకాట శారీరకంగా ఎలాంటి హాని చేయదు కదా అని లా పాయింట్‌ తీస్తున్నారు.

పేదలు తమకు సారాయి కావాలని అడిగితే.. గట్టిగా మందలించి.. అలా తాగకూడదు. తాగితే మీ ఆరోగ్యం చెడిపోతుందని సర్దిచెప్పకుండా.. వారు అడిగిన సారాయిని ఎలా సరఫరా చేయాలన్న ఆలోచనల్లో కేసీఆర్‌ పడ్డారని.. అదే సమయంలో సరదాకో.. కాస్తంత వ్యాపకంగా ఉండే పేకాటను.. పేకాట క్లబ్‌లను మాత్రం మూసేయించటంలో న్యాయం ఉందా అని ప్రశ్నిస్తున్నారు. పేదోళ్లు సారాయి అడిగితే సానుకూలంగా స్పందించే కేసీఆర్‌ సారు.. మధ్యతరగతి జీవులు పేకాట ఆడుకుంటామంటే మాత్రం కస్సుమంటారని.. ఇదెక్కడి న్యాయమని.. మధ్యతరగతివారంటే అంత అలుసా అని రుసరుసలాడుతున్నారు.

 

TAGS

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు