టిఫినీలు తినిపించి.. కాఫీలు తాగిస్తారు కానీ..

టిఫినీలు తినిపించి.. కాఫీలు తాగిస్తారు కానీ..

భారతీయ జనతా పార్టీ నేతల వ్యవహారశైలి కాస్త చిత్రవిచిత్రంగా ఉంటుంది. నిజానీకి కమలనాథుల వ్యవహారశైలికి సంబంధించిన చాలా అంశాలు ఆసక్తికరంగా ఉంటాయి. ఇలాంటివి పత్రికల్లో రాయకపోవటం వల్ల జనసామ్యంలోకి అస్సలు రావు.

రాజకీయ పార్టీ అన్నాక ఇష్టారాజ్యంగా ఉండటం మామూలే అనుకుంటాం. కానీ.. బీజేపీ నేతల వ్యవహారశైలి కాస్త భిన్నంగా ఉంటుంది. తెలంగాణలోని బీజేపీనేతలు తీరు చూస్తే.. రాజకీయ నాయకులై ఉండి ఇలా వ్యవహరిస్తారా? ఇంత జాగ్రత్తగా వ్యవహరిస్తారా అన్న సందేహం కలగకమానదు.

రాజకీయ పార్టీలు అన్నాక సభలు.. సమావేశాలు లాంటివి మామూలే. వాటికి మీడియా మిత్రుల్ని పిలుస్తుంటారు. కార్యక్రమం అయ్యాక వారికి టిఫెన్లు.. భోజనాలు.. కూల్‌ డ్రింక్‌లు లాంటి మర్యాదలు కామనే. ఇలాంటివి ఒక్క బీజేపీలోనే కాదు.. కాంగ్రెస్‌తో మొదలుపెడితే కమ్యూనిస్టులతో సహా అన్నీ రాజకీయ పార్టీలు చేస్తుండేవే.

మిగిలిన రాజకీయ పార్టీలకు.. బీజేపీకి ఓ పెద్ద వ్యత్యాసం ఉంది. మీడియా మిత్రులకు కూల్‌డ్రింక్స్‌ ఇస్తారు కానీ..బీజేపీ నేతలు వాటిని తాగరు. కొంతమంది అయితే మరింత విచిత్రం.. టీలు.. కాఫీలు కూడా అస్సలు టచ్‌ చేయరు.

ఇక.. ఐస్‌క్రీం.. టిఫిన్లు.. నాన్‌వెజ్‌ లాంటివి వడ్డిస్తారు కానీ.. వాటిని ముట్టుకోవటానికి ససేమిరా అంటుంటారు. అంతేకాదు.. ఓ పక్క మీడియా మిత్రులకు పలు వంటకాలు వడ్డిస్తూనే.. ఇంకోవైపు వారు మాత్రం ఇంటి నుంచి తెచ్చుకున్న క్యారేజీతో పని కానిచ్చేస్తుంటారు.

అదేంటండి.. మీరు తినరు.. మాకు పెడతారని ఎవరైనా మీడియా ప్రతినిధి నిష్టూరమాడితే.. అలా అలవాటు అయిపోంది.. ప్లీజ్‌ అలా వదిలేయండి బ్రదర్‌ అంటూ సర్దిచెబుతారే కానీ.. మొహమాటం కోసం మాత్రం అస్సలు తినరు. అదేమంటే.. ప్రిన్స్‌ఫుల్స్‌ అని ముక్తాయిస్తుంటారు. నూటికి నూరు శాతం బీజేపీ నేతలు ఇలా ఉంటారని చెప్పం కానీ.. ఎక్కువ మందిలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తుంటాయి. కమలనాథులు కాస్త డిఫరెంట్‌ అని చెప్పాలి.

 

TAGS

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు