వారసుల్ని ఓడించి పారేశారు

వారసుల్ని ఓడించి పారేశారు

రాజకీయాలు..సినిమాలు అన్నాక కొత్త రక్తం కంటే కూడా.. వంశపారపర్యమే ఎక్కువే ఉంటుంది. అదేం చిత్రమో కానీ.. తండ్రుల్ని.. తల్లుల్ని అభిమానించిన ప్రజలు.. వారి వారసుల్ని కూడా అదే విధంగా అభిమానిస్తూ ఆరాధిస్తుంటారు. దీంతో.. వారసత్వ రాజకీయాలు మూడు పువ్వులు.. ఆరుకాయలుగా వర్థిల్లుతున్నాయి.

కానీ.. అందుకు భిన్నమైన ఫలితాలు.. తాజాగా జరిగిన సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ ఎన్నికల్లో  ఫలితాల్లో వెల్లడయ్యాయి. తలపండిన నేతల పిల్లలు కంటోన్మెంట్‌ బోర్డు ఎన్నికల్లో అడ్డంగా ఓటమి పాలయ్యారు.

ఇలా ఓటమిపాలైన వారి విషయానికి వస్తే.. మాజీ కేంద్రమంత్రి సర్వే సత్యనారాయణ కుమార్తె సుహాసిని.. మాజీ మంత్రి శంకర్రావు కుమార్తెతో పాటు.. ఎమ్మెల్యే సాయన్న కుమార్తె కూడా ఓటమి పాలైన వారసుల్లో ఉన్నారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. నేతల వారసులుగా బరిలోకి దిగిన వారంతా నేతాశ్రీల కుమార్తెలే కావటం.

మొత్తం ఎనిమిది వార్డులకు జరిగిన కంటోన్మెంట్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ నాలుగు స్థానాల్లో గెలుపొందగా.. రెండుస్థానాల్లో టీఆర్‌ఎస్‌ రెబల్‌ అభ్యర్థులు విజయం సాధించగా.. మరో స్థానంలో కాంగ్రెస్‌.. ఇంకోస్థానంలో కాంగ్రెస్‌ రెబెల్‌ అభ్యర్థులు విజయం సాధించారు. మొత్తానికి వారసత్వ రాజకీయాలకు కంటోన్మెంట్‌ బోర్డుఎన్నికల్లో బాగానే చెక్‌ పెట్టినట్లే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు