అది 'టీ' గ్రీన్‌కార్డు అంట

అది 'టీ' గ్రీన్‌కార్డు అంట

రామోజీఫిలింసిటీకి సంబంధించి ఒక్క గజం కూడా అసైన్డ్‌ భూమి లేదని.. ప్రభుత్వం ఒక్క గజాన్ని కూడా సేకరించి ఇవ్వలేదంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ తేల్చి చెప్పటం.. లక్షనాగళ్లతో రామోజీఫిలిం సిటీని దున్నేస్తానని తాను ఎప్పుడూ చెప్పలేదని విస్పష్టంగా తేల్చేయటం తెలిసిందే.

రామోజీ ఫిలింసిటీ.. లక్షనాగళ్ల దున్నుడుకు సంబంధించి కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలు పెద్దచర్చకే దారి తీశాయి. ఈ వ్యాఖ్యలపై బోలెడన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. రామోజీరావుకు కేసీఆర్‌ ఇచ్చిన క్లీన్‌చిట్‌.. అమెరికా ప్రభుత్వం తమ దేశంలోని పౌరులుగా గుర్తిస్తూ గ్రీన్‌కార్డు ఇచ్చిన తరహాలోనే.. సీమాంధ్రకు చెందిన రామోజీరావుకు కేసీఆర్‌.. తెలంగాణ గ్రీన్‌కార్డు ఇచ్చేసినట్లుగా చెబుతున్నారు.

భారీ పెట్టుబడులు.. ఉపాధి అవకాశాలు కల్పిస్తూ తెలంగాణ అభివృద్ధికి కృషి చేస్తున్న వ్యక్తినిప్రోత్సహించటం తప్పేమిటని నిలదీయటమే కాదు.. పెట్టుబడులు పెడతామంటే విదేశాలకు వెళ్లి అక్కడి వారి గడ్డాలు పట్టుకుంటున్నప్పుడు.. రామోజీరావును ప్రోత్సహించటంలో తప్పేంటన్నట్లుగా కేసీఆర్‌ మాటలు సాగటం తెలిసిందే. ఆయన తాజాగా ఏర్పాటు చేస్తున్న ఓం ప్రాజెక్టు కోసం రూ.4వేల కోట్లు పెట్టుబడులు పెడుతున్నట్లు ఈ సందర్భంగా కేసీఆర్‌ వ్యాఖ్యానించటం తెలిసిందే.

తాజా వ్యాఖ్యల నేపథ్యంలో తెలంగాణ లోకల్‌ స్టేటస్‌ను రామోజీరావుకు కేసీఆర్‌ ఇచ్చేసినట్లేనని చెబుతున్నారు. తెలంగాణ వరకు భావోద్వేగ రాజకీయనాయకుల్లో అత్యంత కీలకభూమిక పోషించే ఆయన మనసును రామోజీ గెలుచుకున్నారని.. తెలంగాణలో రామోజీకి ఇక తిరుగులేదన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

ఒక్క తన పార్టీ నేతలు.. కార్యకర్తలు మాత్రమే కాదు.. తెలంగాణవాదులంతా కూడా రామోజీ విషయంలో సానుకూల దృక్ఫధంతో ఉండాలన్న విషయాన్ని కేసీఆర్‌ తన ఒక్క స్టేట్‌మెంట్‌తో తేల్చి చెప్పినట్లేనని చెబుతున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు